తమ భర్తలకు ఏజెన్సీ నుంచి బదిలీ చేయాలని కోరుతున్న పోలీసు సిబ్బంది భార్యలు
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, చింతూరు సబ్ డివిజన్లలో పని చేస్తున్న తమ భర్తలను జీఓ నంబర్–71 ప్రకారం సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరుతూ పలువురు పోలీసు సిబ్బంది భార్యలు, కుటుంబ సభ్యులు కలెక్టర్ కృతికా శుక్లాకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడారు.
2022లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తమ భర్తలు (పోలీసులు) పని చేసేవారన్నారు. వారిని జిల్లాల పునర్విభజన అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, చింతూరు సబ్ డివిజన్లకు బదిలీ చేశారని తెలిపారు. తిరిగి వారిని కాకినాడ జిల్లాకు బదిలీ చేయాల్సిందిగా కోరామని, ఇప్పటికీ ఏజెన్సీలోనే పని చేయిస్తున్నారని చెప్పారు. దీనివలన తాము ఒకచోట, తమ భర్తలు మరోచోట ఉండాల్సి వసోతందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన ఆర్థికంగా, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి లేక తమ భర్తలు వేదనకు గురవుతున్నారన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండేళ్ల నుంచి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని సొంత జిల్లా అయిన కాకినాడ లేదా మైదాన ప్రాంతానికి బదిలీ చేయాల్సిందిగా కలెక్టర్‌కు, ఎంపీ వంగా గీతకు విజ్ఞప్తి చేశామన్నారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందించిన వారిలో 60 మందికి పైగా మహిళలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment