ద్వారకాతిరుమల: గోపాలపురం టీడీపీలో గ్రూపు రాజకీయాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. రెండు గ్రూపుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు, ఎటువంటి ఘటనలకు దారితీస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాకను పురస్కరించుకుని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలకు దేవరపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో నిలిచేందుకు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీలోని బలమైన వర్గం మద్దిపాటికి వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు బహిరంగ సమావేశాలు నిర్వహించింది.
దాంతో ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మంగళవారం చంద్రబాబు రాకను పురస్కరించుకుని పార్టీ నేతలు దేవరపల్లి జంక్షన్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఆ సభలో రెండు వర్గాల నేతలు, వారి అనుచరులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని పోలీసు నోటీసులో పేర్కొన్నారు. అనుమతి లేకుండా రెండు వర్గాలు బైక్ ర్యాలీలు నిర్వహించకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగినా.. అవాంఛనీయ ఘటనలు జరిగినా తాము చేపట్టే చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment