తూర్పు గోదావరి: డిగ్రీ రిజల్ట్ వచ్చిన ఆనందం అంతలోనే ఆవిరి అయింది. ఆ విద్యార్థుల కుటుంబాలలో తీవ్ర విషాదం మిగిల్చింది. పాస్ అయ్యామన్న ఆనందంలో సముద్ర స్నానానికి వెళ్లిన విద్యార్థులలో ఒకరి మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మలికిపురం ఎంవీఎన్ జేఎస్ అండ్ అర్వీ ఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు నలుగురు గురువారం మలికిపురం మండలం చింతలమోరి బీచ్‌కు విహార యాత్రకు వెళ్లారు. డిగ్రీ మొదటి సంవత్సరం ఫలితాలు బుధవారం రాగా వీరు మంచిమార్కులతో పాస్ అయ్యారు.
దీంతో వీరందరూ కలిసి చింతలమోరి బీచ్‌కు వెళ్లారు. కలిసి ఆనందంగా గడిపి సముద్రంలో స్నానానికి దిగారు. మలికిపురం మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి నవీన్ కృష్ణ సముద్రంలో కొట్టుకు పోతుండగా సఖినేటిపల్లి మండలం ఉయ్యూరి వారి మెరక గ్రామానికి చెందిన గొల్ల మందల పవన్ కుమార్(19) కాపాడే ప్రయత్నంలో అతనితోపాటు కొట్టుకు పోయాడు.
వీరిలో గొల్ల మందల పవన్‌కుమార్ మృతదేహం తీరానికి కొట్టుకు వచ్చింది. సమాచారం అందుకున్న మలికిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు ఘటనా స్థలానికి చేరుకుని, బాధిత కుటుంబాలను ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment