అమలాపురం టౌన్/రావులపాలెం: సహజీవనం చేస్తున్న మహిళను, కుమార్తెను గౌతమీ గోదావరిలోకి తోసేసిన ఘటనలో తల్లీబిడ్డల కోసం గాలింపు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్ తెలిపారు. డయల్ 100 కాల్‌తో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. అమలాపురంలోని తన కార్యాలయంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు.
తనతో సహజీవనం సాగిస్తున్న తాడేపల్లికి చెందిన మహిళ సుహాసినితో పాటు కుమార్తెలు లక్ష్మీసాయి కీర్తన, ఏడాది పాప జెర్సీని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్ ఆదివారం వేకువజామున రావులపాలెం వంతెనపై నుంచి గోదావరిలోకి నిర్దాక్షిణ్యంగా తోసేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో సుహాసిని, జెర్సీ గోదావరిలో పడి, గల్లంతవగా, కీర్తన వంతెన కేబుల్ పైపు పట్టుకుని 100 నంబర్‌కు సమాచారం ఇవ్వడం, ఆ బాలికను పోలీసులు రక్షించడం విదితమే.
గోదావరిలో గల్లంతైన సుహాసిని, జెర్సీల కోసం రావులపాలెం, ఆలమూరు పోలీసులు రెండు ప్రత్యేక బోట్లతో గౌతమీ గోదావరిలో విస్తృతంగా గాలిస్తున్నారని ఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఆదివారం ఉదయం నుంచీ గాలింపు సాగుతోందని, సోమవారం సాయంత్రం వరకూ వారి ఆచూకీ తెలియరాలేదని చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడిన సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
పెద్దమ్మను రప్పించి..
కాగా, ఈ ఘటనలో రక్షించిన పదమూడేళ్ల లక్ష్మీ సాయి కీర్తనను పోలీసులు సోమవారం ఆమె పెద్దమ్మకు అప్పగించారు. గల్లంతైన సుహాసినికి తెనాలి చించుపేటకు చెందిన పిండం సుజాత సొంత అక్క. కీర్తన ఇచ్చిన ఆధారాలతో సుజాతను రావులపాలెం రప్పించామని ఎస్సై ఎం.వెంకట రమణ తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నిందితుడు ఉలవ సురేష్ విజయవాడ భవానీపురంలో తనకు తెలిసిన వారి వద్ద కారు అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. సుహాసినిని, తమ కుమార్తె జెర్సీని, ఆమె కుమార్తె లక్ష్మీ సాయి కీర్తనను ఆ కారులోనే ఎక్కించుకుని రావులపాలెం తీసుకువచ్చారని అంటున్నారు. ఆ కారు నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment