
రాజానగరం: పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ కె.మాధవీలత అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఆదివారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించారు. లాలాచెరువు పంచాయతీ పరిధిలోని పుష్కర వనంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కలెక్టర్ తదితరులు స్వయంగా చీపుర్లు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా అంతే అవసరమని చెప్పారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, స్వచ్ఛత విషయంలో ప్రజలను చైతన్యపరచడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని, మనం కూడా అదే బాటలో పయనిస్తూ, ప్రజలు అనారోగ్యాలకు గురి కాకుండా కాపాడుకుందామని అన్నారు. ఒక గంటకు, ఒక రోజుకు పరిమితం కాకుండా స్వచ్ఛత పాటించడం నిరంతర ప్రక్రియగా అలవర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
రాజమహేంద్రవరం సిటీ: కేవలం మన ఇంటినే కాకుండా పరిసరాలతో పాటు నగరాన్ని కూడా అన్ని విధాలా శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. సెంట్రల్ జైల్ పెట్రోలు బంకు సమీపాన నగర పాలక సంస్థ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో ఆయన, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఇటువంటి బృహత్తర కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీధి, ఈ నగరం నాది అనే భావన ఉండాలన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే దోమలు, పందులు రావని, తద్వారా రోగాలు దరిచేరవని అన్నారు. నిత్యం కాకపోయినా వారానికి ఒక గంట ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా వ్యర్థాలను తొలగించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీష్, ట్రైనీ కలెక్టర్ యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment