
దివ్యాంగురాలికి ట్రై సైకిల్ అందజేస్తున్న కలెక్టర్ మాధవీలత తదితరులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన దివ్యాంగురాలు గెడ్డం వర్షితకు స్పందనలో దరఖాస్తు చేసిన గంట వ్యవధిలోనే విభిన్న ప్రతిభావంతుల శాఖ నుంచి ట్రై సైకిల్ అందజేశామని కలెక్టర్ మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ను శెట్టిపేటకు చెందిన గెడ్డం శైలజ కలిసి తన కుమార్తె వర్షితకు చిన్నప్పటి నుంచి మాటలు రావని, నడవలేదని, రెండు పర్యాయాలు ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స కూడా చేయించామని తెలిపారు.
ఇటీవల తన భర్త కిడ్నీ సమస్యతో చనిపోవడంతో వేరే ఆధారం లేదని, తనకు వితంతు పింఛన్లు మంజూరు చేసి, ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే మాధవీలత స్పందించి వర్షితకు మరో పర్యాయం ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేయించాలని, తల్లి శైలజకు వితంతు పింఛను మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డీఎల్‌డీఓ వీణాదేవికి సూచించారు.
అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్పందనలో కలెక్టర్‌తో పాటు జేసీ ఎన్.తేజ్‌భరత్, డీఆర్వో జి.నరసింహులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జగనన్నకు చెబుదాం వెబ్‌సైట్ ద్వారా 1902 నంబర్‌కు ప్రజలు సమస్యలను తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. స్పందనకు 170 అర్జీలు వచ్చాయన్నారు. కాగా బాల్య వివాహాల నివారణలో భాగంగా సమాచార సేకరణ కోసం జిల్లాలో తొలిసారిగా టోల్ ఫ్రీ నంబరు 18004254156ను ప్రారంభించామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. కలెక్టరేట్ స్పందన హాలులో సీ్త్రశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ టోల్ ఫ్రీ నంబరును ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment