
రత్నగిరిపై భీష్మ ఏకాదశి సందడి
అన్నవరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం రత్నగిరి సత్యదేవుని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. రెండో శనివారం కావడంతో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారని అంచనా వేస్తున్నా రు. శుక్రవారం సాయంత్రం నుంచి వేలసంఖ్యలో భక్తులు రత్నగిరికి చేరుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి. కొంతమంది రామాలయం పక్కన గల విశ్రాంతి షెడ్డు లో విశ్రమించారు. రాత్రి ఎనిమిది గంటల సమయానికి దేవస్థానానికి సుమారు పది వేల మంది వచ్చారు.
తెల్లవారుజాము నుంచి వ్రతాలు, దర్శనాలు
స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము ఒంటి గంట నుంచే అనుమతిస్తారని, అలాగే వ్రతాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామివారి వ్రతం టిక్కెట్లు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి విక్రయిస్తున్నారు. దేవస్థానంలోని అన్ని చోట్ల షామియానాలు, భక్తుల కోసం మంచినీటి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈఓ వీర్ల సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
స్వామివారిని దర్శించిన 30 వేల మంది
కాగా శుక్రవారం 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. శుక్రవారం సుమారు రూ.30 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

రత్నగిరిపై భీష్మ ఏకాదశి సందడి
Comments
Please login to add a commentAdd a comment