
365 కేజీల గంజాయి పట్టివేత
ఫ రూ.26.80 లక్షల సొత్తు స్వాధీనం
ఫ ఏజెన్సీ నుంచి కేరళకు
తరలించేందుకు యత్నం
ఫ వ్యాన్ క్యాబిన్‌లో ప్రత్యేక ఏర్పాటు
ఫ డ్రైవర్ అరెస్టు
ఫ కీలక సూత్రధారి, మరికొందరి కోసం గాలింపు
గండేపల్లి: కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో పోలీసులు 365 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, రూ.26,79,750 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. గండేపల్లి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కొద్ది రోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని రంపచోడవరం పరిసర ప్రాంతాల నుంచి గంజాయి ముఠా సభ్యులు కారులో గంజాయి బస్తాలు తెస్తున్నారు. వీటిని గండేపల్లి మండలం ఎన్‌టీ రాజాపురం – కె.గోపాలపురం మార్గంలో అప్పటికే సిద్ధంగా ఉంచిన ఐషర్ వ్యాన్‌లో లోడ్ చేస్తున్నారు. దీని కోసం ఎవ్వరికీ అనుమానం కలగని రీతిలో వ్యాన్ క్యాబిన్‌లో ప్రత్యేక గదిలా ఏర్పాటు చేశారు. ఈ నెల ఒకటో తేదీ రాత్రి గంజాయి బస్తాలు తీసుకువచ్చి వ్యాన్‌లో లోడ్ చేశారు. వ్యాన్ బయలుదేరేందుకు అనుకూలమైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆ మార్గంలో వెళ్తున్న వారు ప్రశ్నిస్తే వ్యాన్ పాడైందని, మెకానిక్‌ను తీసుకుని రావడానికి యజమాని వెళ్లాడని డ్రైవర్ చెప్పేవాడు. దీనిపై జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్సై యూవీ శివ నాగబాబు తన సిబ్బందితో కలసి ఒక్కసారిగా దాడి చేసి, 18 బస్తాల్లో ఉంచిన 365 కేజీల గంజాయితో సహా వ్యాన్, ఒక కారు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాకు చెందిన డ్రైవర్ సబు చూత్తం పరంబిల్ దేవాన్సీని అరెస్టు చేసి, పెద్దాపురం కోర్టులో హాజరు పరచి, రిమాండుకు తరలించారు. గంజాయి తరలింపులో రాజమహేంద్రవరానికి చెందిన వ్యక్తి కీలక సూత్రధారి అని గుర్తించారు. అతడు ఏజెన్సీ నుంచి గంజాయి సేకరించి తమిళనాడుకు చెందిన వ్యక్తి ద్వారా కేరళలో ఉన్న మరో వ్యక్తికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పరారీలో ఉన్న ఈ ముగ్గురి కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యాన సీఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి తరలింపును అడ్డుకోవడంలో చురుకుగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment