
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
అమలాపురం టౌన్: అమలాపురం మండలం పేరూరు శివారు కంసాల కాలనీలో వివాహిత సరెళ్ల కవిత (31) తన అద్దె ఇంట్లో చున్నీతో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు సరిగా తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కవిత పుట్టిల్లు అల్లవరం మండలం గూడాల కాగా, మెట్టినిల్లు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం. ఆమె భర్త సునీల్ నర్సాపురంలో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సీఐ పి.వీరబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన దూనబోయిన పెద్దిబాబు కవితకు కుటుంబ స్నేహితుడు. ఆమె తండ్రి జట్టు కూలీగా పనిచేసినప్పుడు పెద్దిబాబు సైతం అదే పనిలో ఉండడంతో అతనితో ఆ కుటుంబానికి స్నేహం ఏర్పడింది. కవితకు కుమారుడు, కుమార్తె ఉండి పట్టణంలో ఓ కాన్వెంట్‌లో చదువుతున్నారు. సునీల్ కుటంబంతో ఆత్మీయంగా ఉండే పెద్దిబాబు కవిత పిల్లలకు కాన్వెంట్‌కు కేరియర్లు కూడా తీసుకు వెళుతూ ఆమెకు చేదోడు ఉంటాడు. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య కవిత తలుపులు వేసి ఇంట్లో ఉరివేసుకున్న విషయం తెలుసుకున్న పెద్దిబాబు ఆ ఇంటి తలుపుల పగలగొట్టి కవితను రక్షించే ప్రయత్నం చేశాడు. ఆమెను తొలుత అత్యవసర వైద్యం కోసం పట్టణంలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే ఆమె మరణించింది. భార్య ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న భర్త సునీల్ హుటాహుటిన తన అద్దె ఇంటికి చేరుకున్నాడు. కుటుంబీకులు, పెద్దిబాబును విచారిస్తున్నామని, కేసు దర్యాప్తులో కవిత ఏ కారణం వల్ల చనిపోయిందీ తేలుతుందని సీఐ వీరబాబు తెలిపారు. భర్త సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమత్తం ఆమె మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాన్వెంట్ నుంచి వచ్చిన పిల్లలు అమ్మ మరణంతో దిక్కుతోచకుండా రోదిస్తున్నారు. భర్త, ఇరుగుపొరుగు వారు ఈ పిల్లలను ఓదారుస్తున్న తీరు చూపరులను కలచి వేసింది. ఆ చిన్నారులను గుడాలలోని వారి అమ్మమ్మ ఇంటికి పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment