కాకినాడ సిటీ: నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకూ జరిగే ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. ఈ టోర్నమెంట్ నిర్వాహక ఉప కమిటీలతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే జాతీయ స్థాయి క్రీడాకారులకు చక్కటి బస, ఆతిథ్యం, సదుపాయాలు కల్పించాలని అన్నారు. వారి బసకు, అక్కడి నుంచి క్రీడా మైదానానికి వెళ్లేందుకు కాకినాడ, సామర్లకోట రైల్వే, బస్ స్టేషన్ల నుంచి బస్సులు, కార్లు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడాకారుల నమోదు, పోటీల నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆహారం, వైద్య సేవలకు ఉపకమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రారంభ, ముగింపు వేడుకల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పారిశుధ్యం, ట్రాఫిక్, క్రౌడ్ నియంత్రణ, పార్కింగ్, లైటింగ్ తదితర అంశాలపై ఆయా కమిటీల అధికారులతో జేసీ మీనా సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి, డీఎస్‌డీవో బి.శ్రీనివాసకుమార్, సీపీవో పి.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి
జ్ఞాన చైతన్య మహాసభలు
పిఠాపురం: స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక పీఠంలో ఆది, సోమ, మంగళవారాల్లో 97వ వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నారు. పిఠాపురంలోని పీఠం ప్రధానాశ్రమం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు ఈ విషయం తెఇపారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అధ్యక్షతన వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ సభల్లో దేశ విదేశాల నుంచి సుమారు 36 వేల మంది సభ్యులు పాల్గొంటారని తెలిపారు. సభల్లో పాల్గొనే వారికి పీఠం వద్ద భోజన ఏర్పాట్లు చేశామన్నారు. పీఠాధిపతి ఉమర్ ఆలీషా మాట్లాడుతూ 1472లో స్థాపించిన ఈ పీఠం 553 సంవత్సరాలుగా ఆర్ష సూఫీ వేదాంత సారాన్ని ఏకత్వ రూపంగా ప్రబోధిస్తోందని చెప్పారు. 1928లో పంచమ పీఠాధిపతి నిర్వాణానంతరం, ఏటా మాఘ మాసం శుక్ల పక్షంలో తాత్విక విజ్ఞానాన్ని బోధిస్తూ మూడు రోజుల పాటు మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కుల, మత, జాతి, వర్ణ, లింగ, వర్గ తారతమ్యాలు లేని, సర్వ మానవ సమానత్వం కోసం అందరికీ ఆచరణ యోగ్యమైన తత్వాన్ని తమ పీఠం బోధిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై జాన్ బాషా, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్‌టీవీ వర్మ, పింగళి ఆనంద్, ఏవీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ యువతకు
ఉచిత శిక్షణ
నల్లజర్ల: సీపెట్ – విజయవాడ, ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఎస్‌ఐసీ సంయుక్త సౌజన్యంతో 30 మంది ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్టు సీపెట్ డైరెక్టర్ సీహెచ్ శేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ ఎస్సీ, ఎస్టీ హబ్, ఎన్‌ఎస్‌ఎస్‌హెచ్ స్కీం ద్వారా మెషీన్ ఆపరేటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్‌లో 5 నెలల పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అనంతరం సర్టిఫికెట్ ఇచ్చి, అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు, హోసూర్, చైన్నె ప్రాంతాల్లోని ప్రముఖ ప్లాస్టిక్, అనుబంధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నామని వివరించారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయాలను సీపెట్ సంస్థ అందిస్తుందన్నారు. పదో తరగతి పాసై కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత సీపెట్ ప్రతినిధి సుందరరావును 93980 50255 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు
భారీగా నామినేషన్లు
ఏలూరు (మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు శుక్రవారం 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదివరకే నామినేషన్ వేసిన పేపకాయల రాజేంద్ర, ములగల శ్రీనివాసరావు మరో రెండు సెట్ల నామినేషన్లు సమర్పించారు. ఏలూరు కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వికి శుక్రవారం పేరాబత్తుల రాజశేఖర్, వానపల్లి శివగంగ వీరగణేష్, బండారు రామ్మోహన్‌రావు, నేతిపూడి సత్యనారాయణ, పచ్చిగొల్ల దుర్గారావు, బొమ్మిడి సన్నిరాజ్, జీవీ సుందర్, కుక్కల గోవిందరాజు, కాండ్రేగుల నరసింహులు, గద్దే విజయలక్ష్మి, కట్టా వేణుగోపాలకృష్ణ, మాకే ప్రసాద్, చిక్కాల దుర్గారావు, తాళ్లూరి రమేష్, చిక్కా భీమేశ్వరరావు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన అభ్యర్థులతో ఆర్వో ప్రమాణం చేయించారు. ఇంతవరకూ మొత్తం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment