
థీమ్‌లతో పార్కుల అభివృద్ధి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నగరంలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా నగర ప్రజలను, పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక థీమ్‌లతో తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఆ మేరకు పనులు పూర్తి చేయాలని అన్నారు. నగరంలోని 26 పార్కులు, నగరవనం అభివృద్ధికి సెవెన్ హిల్స్ అసోసియేట్స్ ప్రతిపాదించిన ముసాయిదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి కలెక్టర్ తన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి పార్కును ఒక ప్రత్యేకతతో అభివృద్ధి చేయాలని సూచించారు. ఇప్పటికే కంబాల చెరువు, దానవాయిపేట, ప్రకాశ్ నగర్, జేఎన్ రోడ్డు, ఏవీ అప్పారావు రోడ్డు వంటి ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేశామన్నారు. మరింత విలువ ఆధారిత విధానంలో పార్కులు అభివృద్ధి చేయాలని అన్నారు. కేవలం విశ్రాంతికో, పిల్లల ఆటలకో పరిమితం కాకుండా.. జిమ్, యోగా, డ్యాన్స్, ఔషధ మొక్కలు, మ్యూజిక్, రాక్ గార్డెన్, వాటర్ షో, ఫ్లవర్, బర్డ్, వ్యర్థాల నుంచి విభిన్న ఆకృతుల తయారీ, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల వంటి వినూత్న డిజైన్లతో అభివృద్ధి చేయాలని సూచించారు. పార్కులకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కడియం నర్సరీల్లో పర్యాటకాభివృద్ధిపై కూడా పర్యాటకం, హార్టికల్చర్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శైలజవల్లి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment