
ముద్రగడపై దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలి
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణం స్పందించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అక్కడి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు శనివారం స్థానిక ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా ముద్రగడకు ఉన్న ఖ్యాతి, ఆయన కుటుంబానికి ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని అన్నారు. ఆయనపై జరిగిన దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలన్నారు. కడపలో ఎంపీడీఓను ఎవరో తిట్టారని పవన్‌కళ్యాణ్ అడుగుతున్నారు కానీ సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం ఇంటిపైనే దాడి చేస్తే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం స్పందిచలేదంటే ఆయనపై మీ వైఖరి ఎంటో అర్థమౌతుందన్నారు. ప్రశ్నించే నైజం గల వ్యక్తినని చెప్పుకునే పవన్‌కళ్యాణ్ ఒక కులానికి, సమాజానికి మార్గదర్శిగా, రాజకీయంగా నైతిక విలువలు ఉన్న ముద్రగడపై దాడి జరిగితే ఎందుకు ప్రశ్నించడం లేదని, చంద్రబాబు మీ నోరు నొక్కెస్తున్నారా అని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. కూటిమి ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ముద్రగడకు రక్షణ లేదని భావిస్తున్నానన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో దాడికి పాల్పడిన వ్యక్తిని జైల్లో పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకొందన్నారు. సమస్యలపై ప్రశ్నించే పవన్‌కల్యాణ్ నోరుపై చంద్రబాబు చేయి తీసి ఆయనకు ప్రశ్నించే స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. ఇకనైనా ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడులు ఆపాలని, ఇదే వైఖరి కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఆయనకు సంఘీభావం తెలిపిన వారిలో గొల్లపల్లి డేవిడ్, ఎంపీపీలు మార్గని గంగాధర్, తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీలు బోనం సాయిబాబు, తోరాటి రాంబాబు, జవ్వాది రవిబాబు, ముసునూరి వెంకటేశ్వరరావు, చికారమిల్లి చిన్న, కర్రి నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment