
కమనీయం భీమనాథుని కల్యాణం
రామచంద్రపురం రూరల్: పంచారామ క్షేత్రం, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వది అయిన ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఎక్కడా లేని విధంగా మూల విరాట్ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారితో పాటు క్షేత్ర పాలకులైన లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామి వారల దివ్య కల్యాణాన్ని ఒకే వేదికపై తిలకించి భక్తులు పరవశులయ్యారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని నేతృత్వంలో విశేష పుష్పాలంకరణలు చేశారు. దేవస్థానం బ్రహ్మ దేవులపల్లి ఫణి రామకృష్ణ, ఆలయ అర్చకులు, దేవస్థానం వైదిక బృందం ఆధ్వర్యంలో ఉదయం కల్యాణమూర్తులుగా అలంకరించి అనంతరం ఎదురు సన్నాహం నిర్వహించారు. భీమేశ్వరస్వామి వారికి దాత సత్తి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష రుద్రాక్ష పూజ నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణం చేశారు. నంది వాహనంపై స్వామివార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. ఆరుద్రా నక్షత్రయుక్త తులా లగ్నంలో రాత్రి 11.05 గంటలకు శిరస్సులపై జీలకర్ర, బెల్లం ఉంచి మాంగళ్యధారణ చేయించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు, నీరాజన మంత్రపుష్పాలతో కల్యాణం ముగిసింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై భీమనాథుని కల్యాణాన్ని కనులారా తిలకించారు. కల్యాణ మూర్తులకు మంత్రి వేణు దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారిని అలంకరించే నిమిత్తం ఈ ఓ దుర్గాభవానికి అందజేశారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన
టీటీడీ అధికారులు
శోభాయమానంగా ఆలయ ప్రాంగణం
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

కమనీయం భీమనాథుని కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment