
ఏటీఎం కార్డులు మార్చి నగదు చోరీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఏటీఎం సెంటర్ల వద్ద వేచి చూసి నగదు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేస్తున్నట్టు నటిస్తూ వారి ఏటీఎం కార్డులు తస్కరించి ఆనక నగదు చోరీ చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులను స్థానిక ప్రకాశ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కె.రమేష్ బాబు, స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాజీలాల్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంల వద్ద నేరగాళ్లు తిరుగుతున్నారన్న సమాచారంతో ఇన్‌స్పెక్టర్ బాజీలాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మోరంపూడి జంక్షన్‌లోని ఏటీఎం సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న చల్లమూరు వెంకట భాస్కరరావు, పొన్నాడ కిరణ్‌లను గుర్తించి ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిది విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రాంతం పురిటిపెంట గ్రామంగా తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించగా భాస్కరరావు పాత నేరస్తుడిగా తేలింది. అతడు విజయనగరం, విశాఖపట్నం, పెందుర్తి, విజయవాడ, భీమిలి ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద నేరాలు చేసినట్లు గుర్తించారు. అతనిపై 15 కేసులు ఉన్నాయని, పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లుగా పోలీసు రికార్డులు తెలిపాయి. మరో వ్యక్తి పొన్నాడ కిరణ్ ఇంటి దొంగతనం కేసులో నేరస్తుడిగా తెలిసింది. వారిని మరింత లోతుగా విచారించగా నగర పరిధిలో చేసిన నేరాలు ఒప్పుకున్నారు. వీరిద్దరూ ఒకే ఊరికి చెందిన వారు కావడంతో గత ఏడాది నవంబర్ నుంచి ఏటీఎం సెంటర్లో వద్ద దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. ఎంటీఎం సెంటర్లలో వృద్ధులు, పిల్లలకు సాయం చేస్తున్నట్టు నటించి ఏటీఎం కార్డు పిన్ నంబరు తెలుసుకుని అప్పటికే వారి వద్ద ఉన్న అదే బ్యాంకుకు చెందిన మరో ఏటీఎం కార్డు ఇచ్చి పంపేస్తారు. ఆనక ఆ కార్డును వేరే ఏటీఎంలలో పెట్టి నగదు ఊడ్చేస్తారు. ఇలా వారు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాలు, టూ టౌన్, రాజానగరం, రావులపాలెం, ఏలూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏటీఎం సెంటర్ వద్ద దొంగతనాలు చేసినట్లుగా పోలీసులు విచారణలో అంగీకరించారు. వారి నుంచి రూ.2.6 లక్షలు నగదు, 23 ఏటీఎం కార్డులు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనపరిచిన, ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఎస్‌కే బాజీలాల్, ఎస్సై శివప్రసాద్, హెచ్‌సీ ఎన్.రాంబాబు, పీసీలు కె.ప్రదీప్‌కుమార్, ఎస్.వీరబాబులను జిల్లా ఎస్పీ అభినందించారు.
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
రూ.2.6 లక్షల నగదు,
23 ఏటీఎం కార్డుల స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment