
వైభవం.. కుంతీమాధవ పరిణయం
పిఠాపురం: పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతీమాధవ స్వామి వారి దివ్య కల్యాణం పిఠాపురంలో శనివారం వైభవంగా జరిగింది. ఉదయం పిఠాపురం మహారాజా రాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్ పేరున తొలి అర్చన చేసిన అర్చకులు అధిక సంఖ్యలో వచ్చిన భక్తజనం నడుమ కుంతీమాధవస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్ల పరిణయాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల ఆధ్వర్యంలో స్వామి అమ్మ వార్లను వధూవరులుగా తీర్చిదిద్ది కల్యాణ మంటపం వద్ద ఎదురు సన్నాహం నిర్వహించారు. గజ వాహనంపై గ్రామోత్సవం అనంతరం విగ్రహాలను పట్టు వస్త్రాలు, నగలతో అలంకరించారు. అనంతరం వారిని ఊరేగింపుగా తీసుకు వచ్చి సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై కూర్చుండబెట్టారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు, చక్రవర్తుల మాధవాచార్యులు ఆధ్వర్యంలో విష్వక్సేన పూజతో కల్యాణాన్ని ప్రారంభించారు. పుణ్యాహవాచనం, కంకణధారణ, సుముహూర్తం, కన్యాదానం, మంగళసూత్రధారణ, యజ్ఞోపవీత ధారణ, తలంబ్రాలు, ఆశ్వీరచనం తదితర పూజలను సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తుల హరినామ స్మరణతో కల్యాణం కమనీయంగా సాగిపోయింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీరాములు, పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ఉదయం టీటీడీ వేద పండితులు అల్లంరాజు కల్యాణ కామేశ్వర సూర్యనారాయణ ఘనపాఠి ఆధ్వర్యంలో వేద పారాయణం నిర్వహించారు.
పిఠాపురం మహారాజా పేరున తొలి అర్చన
గజ వాహనంపై గ్రామోత్సవం

వైభవం.. కుంతీమాధవ పరిణయం
Comments
Please login to add a commentAdd a comment