నయన మనోహరం
ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
లక్ష్మీ నృసింహుని రథాన్ని లాగుతున్న భక్తులు
సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తకోటి
సాక్షి, అమలాపురం/ సఖినేటిపల్లి: అర్థరాత్రి కనువిందు చేసిన లక్ష్మీ నృసింహుని కల్యాణం.. తెల్లవారు జాము నుంచే మొదలైన సముద్ర స్నానాలు.. అనంతరం శ్రీ, భూ సమేత నృసింహ స్వామి వార్ల దివ్య దర్శనం.. మధ్యాహ్నం పురవీధులను ఇల వెలసిన వైకుంఠంగా మార్చిన రథోత్సవం.. 24 గంటల పాటు వరుసగా సాగిన పుణ్య ఘట్టాలతో భక్తజన హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి.
భక్త వరదుడు అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాలలో భాగంగా శనివారం ఏకాదశి (భీష్మ ఏకాదశి) పర్వదినాన నిర్వహించిన రథయాత్ర అపూర్వంగా నిలచిపోయింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అసంఖ్యాకమైన భక్తుల గోవింద నామస్మరణలు, నరసింహస్వామికి జయజయధ్వానాల మధ్య ఈ రథయాత్ర మనోహరంగా సాగింది.
కల్యాణం అనంతరం స్వామివారు తమ ఇంటి ఆడపడుచు గుర్రాలక్కకు చీర, సారె పెట్టేందుకు రథంపై ఊరేగుతూ మెరకవీధిలోని ఆలయం వద్దకు వెళ్లడం ఆనవాయితీ. రథయాత్రకు ముందు మంగళ వాయిద్యాలతో, అర్చకుల వేదమంత్రాలతో నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి పల్లకిలో రథం వద్దకు తోడ్కొని వచ్చారు. రథానికి భక్తులు అరటి గెలలు, గుమ్మడికాయలు కట్టించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మొగల్తూరుకు చెందిన ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహద్దూర్, ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కొబ్బరి కాయలు కొట్టి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. కొత్తపేట డీఎస్పీ మురళీ మోహన్, అమలాపురం ఆర్డీవో కె.మాధవి, ఎండోమెంట్స్ డీసీ రమేష్‌బాబు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దిరిశాల బాలాజీ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మెరకవీధి నుంచి ప్రారంభమైన రథయాత్ర పల్లపువీధి మీదుగా పదహారు కాళ్ల మండపం వద్దకు చేరుకుంది. మార్గం మధ్యలో గుర్రాలక్కకు ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు స్వామి తరఫున చీరె, సారె ఇచ్చారు.
పుణ్య స్నానాలు
స్వామివారి కల్యాణం అనంతరం శనివారం వేకువ జామున భీష్మ ఏకాదశి పర్వదినాన పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. కల్యాణం అనంతరం ఉన్న భక్తులకు తోడు రథయాత్ర చూసేందుకు వచ్చిన భక్తులతో సాగరతీరం కిటకిటలాడింది. పలువురు తలనీలాలు సమర్పించి పుణ్యస్నానాలు చేయగా, మరికొందరు పితృ దేవతలకు తర్పణాలు వదిలారు. అనంతరం స్వామివారి దర్శనానికి బారులు తీరారు.
అంతర్వేదిలో నేడు
ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకూ సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, బాలభోగం, వార్షిక అభిషేకాలు, అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలు, సాయంత్రం 4 గంటలకు గజ వాహనంపై, రాత్రి 8 గంటలకు పొన్న వాహనంపై గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. భీష్మ ఏకాదశి రోజు నుంచి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి నాడు విరమణ చేసే అర్చకులు స్వామికి అన్న దర్శనం చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా పొలమూరు సత్రం నిర్వాహకులతో అన్నపర్వత మహా నివేదన చేస్తారు. ఇది రాత్రి 7 గంటలకు జరగనుంది.
వైభవంగా సాగిన లక్ష్మీ నృసింహుని రథోత్సవం
సోదరి గుర్రాలక్కకు చీర, సారె సమర్పణ
పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు
విశేష సేవలందించిన ఆలయ అధికారులు
నయన మనోహరం
నయన మనోహరం
నయన మనోహరం
Comments
Please login to add a commentAdd a comment