వంగలపూడిలో ఇసుక దోపిడీ
వంగలపూడి ర్యాంపులో ఇసుక ఎగుమతులు
● అధిక ధరలకు అమ్మకాలు
● ప్రతి టన్నుకూ అ‘ధనమే’
● కలెక్టర్‌కు బాధితుల ఫిర్యాదు
సీతానగరం: కూటమి నేతలకు ఇసుక కల్పతరువుగా మారింది. రూ.కోట్లు కురిపిస్తూండటంతో నిబంధనలు ఇసుకలో తొక్కేస్తున్నారు. తాజాగా లైసెన్స్ తెచ్చుకుని మరీ అడ్డూ అదుపూ లేకుండా దోచేస్తున్నారు. స్టాక్ పాయింట్లను అనువుగా మార్చుకుని దందాకు తెర తీశారు. ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఏం జరుగుతోందంటే..
సీతానగరం మండలం వంగలపూడి ఇసుక ర్యాంపులో రీచ్–1, 2లలో ఇసుక అమ్మకాలకు ఇటీవల అనుమతులు ఇచ్చారు. రీచ్–1లోని ఇసుకను స్థానికంగా అమ్మకుండా విశాఖలోని స్టాక్ పాయింట్‌కు తరలిస్తున్నారు. రీచ్–2లోని ఇసుక అమ్మకాలకు అనుమతులు ఇచ్చారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో కూలీలతో ఇసుక తవ్వకాలు జరిపించి, ట్రాక్టర్లపై స్టాక్ పాయింట్ వద్ద డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి పొక్లెయిన్‌తో లారీల పైకి ఇసుక ఎగుమతి చేస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అక్రమార్కులు అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకువారి నుంచి తవ్వకం, బాట చార్జీలు కలిపి ఇక్కడ టన్ను ఇసుకకు సుమారు రూ.84 మాత్రమే వసూలు చేయాలి. కానీ రూ.250 గుంజుతున్నారు. పైగా ఫోన్‌పే వంటి ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా మరీ వసూలు చేస్తూండటం గమనార్హం. ఈ రీచ్ నుంచి 25 నుంచి 40 టన్నుల లారీలపై ఇసుక తరలిస్తున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
వంగలపూడి రీచ్–2లో అధిక ధరలకు ఇసుక అమ్ముతున్నారంటూ కాకినాడ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తు లు ఐదు రోజుల కిందట పక్కా ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 24 టన్నుల లారీ ఇసుకకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ.2,040 మాత్రమే చెల్లించాల్సి ఉండగా టన్నుకు రూ.250 చొప్పున రూ.6 వేలు వసూలు చేశారంటూ రశీదుతో పాటు ఇతర ఆధారాలు చూపారు. ఈ ర్యాంపులో ఇసుకను అధిక ధరలకు అమ్ముతున్నారంటూ గతంలో కూడా లారీ డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు ఈ ర్యాంపును మూయించారు. అనంతరం జేసీ, అప్పటి ఇన్‌చార్జి ఆర్డీవో భాస్కరరెడ్డి ర్యాంపులో విచారణ జరిపి, టన్ను ఇసుకకు రూ.84 మాత్రమే తీసుకోవాలని, అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. లారీ డ్రైవర్లకు కనిపించే విధంగా ధరల పట్టికతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. ఇంత జరిగినా.. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో దోపిడీ సాగుతున్న నేపథ్యంలో ఈ దందా వెనుక కూటమి నేతల అండదండలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment