పీడీఎఫ్ ఎమ్మెల్సీలది ప్రజాగళం
● ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు
● ఘనంగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవులు పరిచయ కార్యక్రమం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన గొంతెత్తి నినదించేది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఎమ్మెల్సీలు మాత్రమేనని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యాన పీడీఎఫ్ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి డీవీ రాఘవులు పరిచయ కార్యక్రమం స్థానిక ఆనం రోటరీ హాలులో శనివారం జరిగింది. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు వంత పాడటంతో నిరుద్యోగులు, పేదలు, నిమ్న వర్గాల వారు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నిజాయితీ, నిస్వార్థం క్రమశిక్షణ, ప్రజా సమస్యలపై పోరాటం పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఆస్తులని చెప్పారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలకు కూటమి నేతలు ఎన్నికల్లో మాట ఇచ్చారని, గెలిచిన తర్వాత తొలి సంతకం చేసి, ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదని విమర్శించారు. సాకులు చెబుతూ డీఎస్సీని వాయిదా వేస్తున్నారన్నారు. విజన్–2047 అంటూ కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తోందన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు, అంగన్‌వాడీల సమస్యలపై సక్రమంగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, నూతన పీఆర్‌సీ ఏర్పాటు వంటి వాటిపై ప్రభుత్వం ఉదాశీన వైఖరి అవలంబిస్తోందన్నారు. రాఘవులును గెలిపిస్తే, ప్రజా సమస్యలపై శాసన మండలిలో నినదించే గొంతవుతారని చెప్పారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అరుణ్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎన్.అరుణ కుమారి, జ్యోతిబసు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యం, కేవీపీఎస్ జిల్లా నాయకుడు జువ్వల రాంబాబు, జేఏసీ జిల్లా నాయకుడు ప్రవీణ్, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు బేబీరాణి తదితరులు కూడా ప్రసంగించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి డీవీ రాఘవులు మాట్లాడుతూ, తాను మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ యూటీఎఫ్, ఇతర ఉద్యోగ సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వహించి, అనేక పోరాటాలు చేశానని, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నానని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎ.షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment