రత్నగిరి.. భక్తజన గోదారి
● సత్యదేవుని దర్శించిన లక్ష మంది
● 13 వేల వ్రతాలు ● రూ.కోటి ఆదాయం
అన్నవరం: వరదల వేళ పోటెత్తే గోదారిలా.. భీష్మ ఏకాదశి పర్వదినం, రెండో శనివారం సెలవు కలసి రావడంతో.. రత్నగిరిపై భక్తజన ప్రవాహం పరవళ్లు తొక్కింది. సత్యదేవుని దర్శించేందుకు లక్ష మందికి పైగా భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ భక్తులు స్వామివారి దర్శనానికి వెల్లువలా వస్తూనే ఉన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకే తెరచి, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి వ్రతాలు ప్రారంభించారు. రద్దీ కారణంగా అంతరాలయ దర్శనాలను మధ్యాహ్నం వరకూ నిలిపివేశారు. యంత్రాలయంలో ప్రదక్షిణ దర్శనం కూడా నిలిపివేశారు. వ్రత మండపాలు నిండిపోవడంతో స్వామివారి నిత్య కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించారు. దీంతో ఉదయం 11 గంటలకు స్వామివారి నిత్యకల్యాణం ప్రారంభించారు. భక్తుల ద్వారా దేవస్థానానికి రూ.కోటికి పైగా ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సుమారు 13 వేల వ్రతాలు జరిగాయి. ఆలయం, పది వేల మంది భక్తులకు సర్కులర్ మండపంలో పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు. రామాలయం వద్ద విశ్రాంతి మండపంలోను, పలుచోట్ల ఏర్పాటు చేసిన షామియానాల్లోను భక్తులు సేద తీరారు.
స్వర్ణ పుష్పాలు, చామంతులతో అర్చన
ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవారికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పాలతో, 9 గంటలకు చామంతులతో అర్చన నిర్వహించారు.
సాఫీగా దర్శనాలు
భీష్మ ఏకాదశి రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు రోజులుగా చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలనిచ్చాయి. ప్రధానంగా పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్‌మెంట్ల వలన భక్తులను నియంత్రించడం సులువైంది. ఆలయం వద్ద క్యూ లైన్లు ఖాళీ అవగానే కంపార్ట్‌మెంట్లలోని భక్తులను లోపలకు అనుమతిస్తూండటంతో ఎక్కడా తొక్కిసలాట జరగకుండా భక్తులు సాఫీగా స్వామి దర్శనం చేసుకున్నారు.
ఇవీ ఇబ్బందులు
సత్యదేవుని సన్నిధిలో రూ.1,500 టికెట్టు వ్రతాల కోసం గతంలో అనివేటి మండపాన్ని రెండుగా విభజించి మధ్యలో కట్టిన చాపలను శనివారం తొలగించారు. దీంతో ధ్వజస్తంభానికి ఎడమవైపు మండపంలో ఉన్నవారు అదంతా మైకులో విని చేయాల్సి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment