రీసర్వేలో నిర్లక్ష ్యం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): భూముల రీసర్వేలో నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ జిల్లాలోని 26 మంది ఉద్యోగులకు కలెక్టర్ పి.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, 12 మంది డిప్యూటీ తహసీల్దార్లు (డీటీ), 12 మంది మండల సర్వేయర్లు ఉన్నారు. రాజానగరం మండలం యర్రంపాలెం గ్రామ సర్వేయర్ వి.రమేష్ కుమార్ లాగిన్‌లో 5, కానవరం గ్రామ సర్వేయర్ వై.గంగరాజు లాగిన్‌లో 4 పౌర సేవలు పెండింగ్‌లో ఉన్నాయని, ఇది మొత్తం జిల్లా పరిపాలన పురోగతిపై ప్రభావం చూపిందని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే, పెరవలి, గోపాలపురం, రాజమహేంద్రవరం రూరల్, చాగల్లు, గోకవరం, కడియం, దేవరపల్లి, నల్లజర్ల, బిక్కవోలు, కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాలకు చెందిన 12 మంది సర్వేయర్‌లు, డిప్యూటీ తహసీల్దార్లకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన అధికారులుగా విధి నిర్వహణలో వీరు విఫలమయ్యారని పేర్కొన్నారు. రీసర్వే సమస్యల పరిష్కారంపై కలెక్టర్, ఉన్నతాధికారుల సూచనలు పాటించలేదని, విధులు సమర్థవంతంగా నిర్వహించలేదని, ఇది వారి నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని చూపుతోందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో రీసర్వే ప్రక్రియను నిర్దిష్ట మార్గదర్శకాలను అనుసరించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ఇందులో నిర్లక్ష్యం చూపినందున ఈ 26 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. వీరిపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు.
26 మందికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు
వారిలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, 12 మంది డీటీలు, మండల సర్వేయర్లు
Comments
Please login to add a commentAdd a comment