ఉద్యోగ భద్రత కల్పించండి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కె.సుమన్, సహాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ కోరారు. శనివారం రాజమహేంద్రవరంలో వారు పర్యటించి పలు శాఖల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో మమేకమయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమన్, సంపత్‌కుమార్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదపాటి గురునాథ్ పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలు అయినప్పటికీ రాష్ట్రంలో మెప్మా, సెర్ప్‌లో పనిచేసే ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం హెచ్‌ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించిందన్నారు. ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలక ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నారని, వీరికి భద్రత లేని కారణంగా అనేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. అందరికీ హెచ్‌ఐర్ పాలసీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సుధాకర్, పి.లోవరాజు, ఎడ్ల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment