చికెన్ షాపులు వెలవెల
ఆలమూరు/కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగడంతో మాంసాహారం మార్కెట్ పూర్తిగా కుదేలైంది. మాంసాహారాన్ని ఉడికించి తింటే వైరస్ ప్రభావం ఏమీ ఉండదని పశుసంవర్ధకశాఖ, వైద్యారోగ్యశాఖ చెబుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులు ఈ రెండింటికి దూరంగా ఉంటే బెటర్ అనే అభిప్రాయం వినియోగదారుల్లో కన్పిస్తోంది. బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం అంతగా లేకపోవడంతో ఆదివారమైనా వ్యాపారం సజావుగా సాగుతుందని భావించిన చికెన్, మటన్ వ్యాపారులకు నిరాశే మిగిలింది. దీంతో మాంసాహారాన్ని కొనుగోలు చేసే వినియోగదారుల లేక వ్యాపారులు గగ్గోలు పెట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు రెండు వేల మటన్, చికెన్ దుకాణాల ద్వారా వారంతపు రోజైన ఆదివారం సుమారు వెయ్యి మేకలతో పాటు దాదాపు 50 వేల బ్రాయిలర్, ఫారం కోళ్ల మాంసం విక్రయాలు జరుగుతుంటాయి. మిగతా రోజుల్లో మాత్రం అందులో సుమారు 40 శాతం మాత్రమే వ్యాపారం జరుగుతుంది. కాని బర్డ్ ప్లూ వల్ల ఈ ఆదివారం ఆశించినంత స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కిరాణా షాపులు, హోల్‌సేల్ దుకాణాల్లో గుడ్లు కొనుగోలు చేసేందుకు సైతం వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు.
గణనీయంగా పడిపోయిన చికెన్ విక్రయాలు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ప్లూ వైరస్ కల కలం అధికంగా ఉన్నా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఆ ప్రభావం లేదు. అయినా జిల్లావ్యాప్తంగా బ్రాయిలర్, ఫారం కోళ్ల ధరలు కొంతమేర తగ్గినా వినియోగదారులు మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఇప్పటి వరకూ చికెన్ కేజీ ధర రూ.300 నుంచి రూ.180కి పడిపోయినా వ్యాపారులకు ప్రయోజనం కలిగించలేదు. అమ్మకానికి తెచ్చిన కోళ్లు అలాగే ఉండిపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు కూడా మూతబడటంతో చికెన్ వ్యాపారానికి కోలుకోని దెబ్బ తగిలిందనే అభిప్రాయం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.
మటన్ విక్రయాలపై అదే ప్రభావం
బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం చికెన్ విక్రయాలతో పాటు కొంత మేర మటన్ విక్రయాలపై పడింది. మటన్ ధర అధికంగా ఉండటంతో పాటు ఈ ఆదివారం పెళ్లి ముహుర్తాలు ఎక్కువగా ఉండటం కూడా మటన్ విక్రయాలపై ప్రభావం పడిందని తెలుస్త్తోంది. దాదాపుగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మటన్ అమ్మకాలు బారీగా తగ్గిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మటన్ బారీస్థాయిలో నిల్వ ఉండిపోవడంతో నష్టాలు తప్పవని వారు ఆవేదన చెందుతున్నారు. రెస్టారెంట్లలో చికెన్ స్థానంలో మటన్ ఐటమ్స్ తయారు చేస్తున్నా ఆదరణ అంతంత మాత్రంగానే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.
42 ఆర్‌ఆర్‌టీ బృందాల ఏర్పాటు
కాకినాడ జిల్లాలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా పశుసంవర్థకశాఖ 21 మండలాల్లో మండలానికి రెండు బృందాలు చొప్పున 42 ఆర్‌ఆర్‌టీ బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో పశువైద్యాధికారితో పాటు ఇద్దరు కాంపౌండర్‌లు, ఇద్దరు అసిస్టెంట్‌లు కలిపి మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. పీపీఈ కిట్స్, మాస్క్‌లు, స్ప్రేయింగ్ మందులు అందుబాటులో ఉంచారు.
జాగ్రత్తలు తీసుకుంటే సరి
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే యథేచ్ఛగా మాంసాహారాన్ని భుజించవచ్చు.
ఇంట్లో హైజిన్ పాటించాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి
వంట చేసుకునే ముందు కచ్చితంగా కిచెన్ రూమ్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
పచ్చి మాంసం, కోడిగుడ్లు, చికెన్ పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేసుకోవాలి.
మాంసాహారాన్ని 75 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేసి తినడం ద్వారా వైరస్‌ను నశింపజేయవచ్చు.
ముడి మాంసం, సగం ఉడికించిన కోడి గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినరాదు.
మాంసాహారాన్ని ఉడకపెట్టిన తరువాత బయటకు తీసి శుభ్రపరచుకుని వండుకోవాలి.
బర్డ్‌ఫ్లూ కలకలంతో దుకాణాల మూసివేత
మాంసాహారం కొనుగోలుకు
ప్రజలు దూరం
వ్యాపారుల ఆదివారం ఆశలు గల్లంతు
కోళ్లు, మాంసం వివరాలు
పాత ధర (కేజీ) కొత్త ధర (కేజీ)
రూపాయల్లో.. రూపాయల్లో..
బ్రాయిలర్ (లైవ్) 120 85
ఫారం (లైవ్) 80 50
బ్రాయిలర్ చికెన్ 300 180
ఫారం చికెన్ 200 130
కోడి గుడ్లు 07 4.50
అపోహలు వీడండి
జిల్లాలో ఎక్కడా బర్డ్ ప్లూ వైరస్ కేసు నమోదు కానందున మాంసాహారాన్ని భుజించవచ్చునని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకూ చెబుతున్నారు. బర్డ్ ప్లూ వైరస్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించితే జీవించే అవకాశం లేదని వివరిస్తున్నారు. ఉడికించిన మాంసాహారాన్ని తింటే ఏవిధమైన వ్యాధులు దరి చేరవని, బర్డ్ ప్లూ అసలు సోకదంటూ జిల్లా పశుసంవర్థకశాఖ, వైద్యారోగ్యశాఖ గ్రామాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి వివరిస్తున్న సంగతిని ప్రజా ప్రతినిధులు తెలియజేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేయమని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. శీతాకాలం ముగిసి వేసవికాలంలోకి ప్రవేశించేటప్పుడు సాధారణంగా బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అపోహలు వీడండి–యదేఛ్ఛంగా మాంసాహారం భుజించండి అంటూ స్వచ్ఛంద సంస్థలు, పౌల్ట్రీ యజమానులు ప్రచారం నిర్వహిస్తున్నారు.
ధరలు తగ్గినా వ్యాపారం లేదు
బర్డ్ ప్లూ వైరస్ నిర్ధారణ కాకపోయినా ప్రచార మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగున్నందువల్ల చికెన్, కోడిగుడ్లు ధరలు తగ్గినా ఆ మేరకు వ్యాపారం జరగలేదు. వినియోగదారులు కూడా మాంసాహారంపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. చికెన్ వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– గాడ శివ, చికెన్ వ్యాపారి, ఆలమూరు
మటన్ విక్రయాలు పడిపోయాయి
బర్డ్ ప్లూ వ్యాధి వ్యాప్తి చెందుతుందంటూ పుకార్లు సృష్టించడం వల్ల చికెన్ విక్రయాలతో పాటు మటన్ విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. రెస్టారెంట్లలో కూడా చికెన్‌కు డిమాండ్ తగ్గగా ఆమేరకు మటన్ విక్రయాలు పెరగలేదు. మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చితి వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం.
– రొట్టా సతీష్, మటన్ వ్యాపారి, రావులపాలెం
చికెన్ షాపులు వెలవెల
చికెన్ షాపులు వెలవెల
Comments
Please login to add a commentAdd a comment