వక్క.. లాభాలు పక్కా | - | Sakshi
Sakshi News home page

వక్క.. లాభాలు పక్కా

Published Mon, Feb 17 2025 12:19 AM | Last Updated on Mon, Feb 17 2025 12:14 AM

వక్క.

వక్క.. లాభాలు పక్కా

పిఠాపురం: ప్రకృతి వ్యవసాయం పరవళ్లు తొక్కుతుందనడానికి నిదర్శనమే కొత్త పంటల సాగు. వైవిధ్యమైన వ్యవసాయ విధానాలను రైతులు అవలంబిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ ఎక్కడా సాగు చేయని పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే జాజికాయ, జాపత్రి వంటి అరుదైన పంటలను పరిచయం చేసిన స్థానిక రైతులు ఇప్పుడు పోకచెక్క సాగు చేపట్టారు. ఒక్కసారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడులు ఇచ్చే సాగు పోక చెక్క. రసాయనక ఎరువులు, క్రిమిసంహారక మందులతో పని లేకుండా తక్కువ నీటి వసతి ఉన్నా సాగు చేసుకునే ఈ పంటను కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. పంట సాగు చేసిన నాలుగేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. దిగుబడి ప్రారంభం నుంచి వందేళ్ల వరకు ఎటువంటి పెట్టుబడి లేకుండా నిరంతరాయంగా ఆదాయం పొందే అవకాశం వక్క సాగులో మాత్రమే ఉంది. ఒక ఎకరం పొలంలో 450 నుంచి 500 వరకు మొక్కలు నాటుతున్నారు. పంట నాటిన నాలుగేళ్ల అనంతరం ఎకరానికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. ఒక్కో చెట్టు నుంచి గరిష్టంగా సుమారు 100 కేజీల వరకు పోకచెక్క కాయల దిగుబడి వస్తుంది. దీని నుంచి 30 శాతం వరకు పోకచెక్క వస్తుంది. మార్కెట్‌లో ధరలు బాగుంటే రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. విత్తన కాయల నుంచి మొక్కలను పెంచి తోటలు వేస్తుంటారు. ఈ మొక్కలకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయాల్సిన పని లేదు. కేవలం అవసరమైనప్పుడు నీరు పెట్టుకోవడం, సేంద్రియ ఎరువులు ఏడాదికి రెండు మూడు సార్లు వేసుకుంటే సరిపోతుంది. ఏడాదిలో వక్క దిగుబడి వచ్చే నాలుగు నెలలు మాత్రమే రైతుకు పని ఉంటుంది. మిగిలిన ఎనిమిది నెలలు చెట్ల సంరక్షణ చూసుకోవాల్సి ఉంటుంది. తక్కువ పెట్టుబడితో సేంద్రియ పద్ధతిలో సాగుకు అనుకూలంగా ఉండడంతో స్థానిక రైతాంగం వక్క తోటల పెంపకం చేపట్టింది. శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే ఈ పంటను ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కాకినాడ జిల్లాలోని తొండంగి, రౌతులపూడి, జగ్గంపేట, ప్రత్తిపాడు, గొల్లప్రోలు మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు.

ఒక్కసారి సాగు చేస్తే వందేళ్ల ఆదాయం

సేంద్రియ విధానంలో ప్రయోగాత్మకంగా సాగు

జిల్లాలో పోకచెక్క సాగు 15.20 హెక్టార్లు

సాగు చేస్తున్న రైతులు 50 మంది

సాగవుతున్న మండలాలు 5

సాగు బాగుంది

ఇప్పటి వరకు పలు రకాల వాణిజ్య పంటలు సాగు చేశాను. అయితే కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, తెగుళ్లు పంటలను తీవ్రంగా దెబ్బతీయడంతో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. రెండేళ్ల కిత్రం ఎకరం పొలంలో చెక్క సాగు ప్రారంభించాను. మరో ఏడాదిన్నరలో పంట ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతానికి అనువైనది కాకపోయినా ప్రస్తుతం పంట బాగానే ఉంది.

– దేశినీడి నాగేశ్వరరావు, చెక్క సాగు చేసిన రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం

రైతులు ఆసక్తి చూపుతున్నారు

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే చెక్క సాగుకు స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత రెండేళ్లుగా జిల్లాలో పోకచెక్క సాగు చేపట్టారు. ప్రస్తుతం మొక్కలు బాగానే ఎదుగుతున్నాయి. కొన్నింటి దిగుబడి ప్రారంభమైంది. మిగిలిన చోట్ల దిగుడులు బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

– ఎన్‌.మల్లిఖార్జునరావు,

ఉద్యానశాఖాధికారి, కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment
వక్క.. లాభాలు పక్కా 1
1/1

వక్క.. లాభాలు పక్కా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement