వ్యవసాయానికి ఈ–క్రాప్
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
రూపొందించిన వినూత్న విధానం
● ప్రకృతి విపత్తుల్లో రైతులకు మేలు
● పక్కాగా పంటల నష్ట పరిహారం
● ఇతరత్రా లబ్ధికీ అవసరం
● కొనసాగిస్తున్న కూటమి సర్కార్
● ఇప్పటికే 97 శాతం పైగా పూర్తి
సాక్షి, రాజమహేంద్రవరం: రైతులకు పంట నష్టపరిహారం, పండించిన ఉత్పత్తులు విక్రయించాలంటే ఈ–క్రాప్ తప్పనిసరి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ విధానం ద్వారా రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. ప్రస్తుతం అదే విధానం కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ–పంట నమోదు ప్రక్రియను వ్యవసాయ అధికారులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఏ రైతుకు ఎంత భూమి ఉంది, ఏయే పంటలు సాగు చేస్తున్నారనే వివరాలు నమోదు చేస్తున్నారు.
ఉద్దేశం ఇదీ..
రైతులకు ప్రభుత్వ సేవలు చేరువ కావాలంటే ఈ–క్రాప్ తప్పనిసరి. ప్రతి రైతూ తాను సాగు చేసిన పంటను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. పంటల నమోదుకు రైతులు ఆధార్, ఫోన్ నంబర్, పొలం సర్వే నంబర్, పంట వివరాలను వ్యవసాయ అధికారులకు చెప్పాలి. పొలం వద్దకు వెళ్లి, తాను సాగు చేసిన పంట వద్ద ఫొటోలు తీయించుకోవాలి. ఈ ప్రక్రియ ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. నేటికీ సాగుతూనే ఉంది. రైతులు అందుబాటులో లేకపోవడంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. రైతు సహాయ కేంద్రాల్లోని వ్యవసాయ, ఉద్యాన సహాయకులు ప్రతి రోజూ వేల ఎకరాలకు సంబంధించి ఈ–క్రాప్ నమోదు చేస్తున్నారు. పొలంలో ఏ పంట సాగు చేశారు? ఎవరు వేశారు? ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో సాగు చేపట్టారనే వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించి, ఆ వివరాలను సంబంధిత యాప్‌లో పొందుపరుస్తున్నారు. కౌలు రైతుల సాగు వివరాలను సైతం ఈ–క్రాప్‌లో నమోదు చేస్తున్నారు. కౌలు గుర్తింపు కార్డులు లేకపోయినా.. పంట సాగు చేయడాన్నే ప్రామాణికంగా తీసుకుని నమోదు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, పరిహారం, రాయితీలు, మార్కెటింగ్ ఇలా రైతులకు ఏది కావాలన్నా.. ఈ–పంట నమోదు కీలకం కావడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఈ ఏడాది కొత్తగా రైతుల బయోమెట్రిక్ ద్వారా ఈ–క్రాప్ బుకింగ్ నిర్వహిస్తున్నారు. నమోదు అనంతరం గుర్తింపు పత్రాలను అందించనున్నారు.
సిబ్బంది కొరతతో..
ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను పరిశీలించేందుకు వ్యవసాయ అధికారులు, సిబ్బంది, వీఆర్వోలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ లోగా ఈ–క్రాప్ చేయించుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ–క్రాప్ వివరాలతో పాటు రైతు సహాయ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ (ఈ–కేవైసీ) కూడా చేయించుకోవాలని సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. గత ప్రభుత్వ అభివృద్ధి ముద్రలను చెరిపివేసే లక్ష్యంతో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అనేకచోట్ల సిబ్బంది కొరత నెలకొంది. దీనికి తోడు సాంకేతిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో ఈ–కేవైసీ ప్రక్రియ ఆలస్యమవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
25 వరకూ గడువు
ఈ–క్రాప్ నమోదుకు ఈ నెల 25వ తేదీ వరకూ గడువు విధించారు. ఇప్పటికే జిల్లాలో 97 శాతం పైగా ఈ–క్రాప్ ప్రక్రియ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. మిగిలింది సైతం రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామని అంటున్నారు. అనంతరం మార్చి 1 నుంచి 5వ తేదీ వరకూ రైతు సేవా కేంద్రాల్లో ఆ జాబితాను ప్రదర్శిస్తారు. దీనిపై 10వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్చి 15న తుది జాబితా ప్రదర్శించనున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీలో 1,78,920 ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు సాగు చేశారు. ఇప్పటి వరకూ 1,73,843 ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు చేసినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. 97.16 శాతం లక్ష్యాన్ని సాధించామని చెబుతున్నారు. మొత్తం 1,35,092 మంది రైతులకు ఈ–కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసి 79.89 శాతం లక్ష్యం సాధించామని చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.
లక్ష్యాన్ని సాధిస్తాం
ఈ–క్రాప్ ప్రక్రియ జిల్లాలో చురుకుగా జరుగుతోంది. రైతులు పంట నష్టపరిహారం, పంటల విక్రయం, ఎరువులు, పురుగు మందులు పొందాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆ దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి
జిల్లాలో ఈ–క్రాప్ నమోదు ఇలా..
మండలం విస్తీర్ణం ఈ–పంట ఈ–కేవైసీ
(ఎకరాల్లో) నమోదు
(ఎకరాల్లో)
బిక్కవోలు 13,533 13,226 8,656
అనపర్తి 9,105 8,750 5,776
సీతానగరం 16,099 14,508 9,093
దేవరపల్లి 13,071 12,042 8,343
కడియం 5,122 4,845 3,623
రాజానగరం 8,243 8,150 6,078
గోకవరం 6,913 6,912 5,262
కొవ్వూరు 11,069 10,898 8,295
నిడదవోలు 16,319 16,317 12,868
తాళ్లపూడి 8,672 8,670 7,011
పెరవలి 8,178 7,801 6,309
గోపాలపురం 14,720 14,718 11,970
కోరుకొండ 8,489 8,191 6,993
నల్లజర్ల 11,654 11,190 9,790
ఉండ్రాజవరం 11,449 11,448 10,089
చాగల్లు 8,597 8,515 7,660
రాజమహేంద్రవరం రూరల్ 3,416 3,386 3,192
రంగంపేట 4,050 4,267 4,076
వ్యవసాయానికి ఈ–క్రాప్
Comments
Please login to add a commentAdd a comment