ఎమ్మెల్సీ ఎన్నికలకు రెడీ
సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికల అనంతరం జరగనున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం తలమునకలైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. జిల్లాల కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా, డీఆర్‌ఓలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు.
కార్యాచరణ ప్రణాళిక
ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు లాంటి ప్రక్రియకు చేసింది. ప్రత్యేక శిబిరాలు నిర్వహించి మరీ ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టారు. పట్టభద్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించారు. ఓటర్ల జాబితా రూపొందించి ఎన్నికల సంఘానికి పంపారు. ఎట్టకేలకు ఎన్నికలకు ఓటర్ల లెక్క తేల్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,97,945 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. పురుషులు 1,15,938, మహిళలు 82,033, ఇతరులు 10 ఉన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27వ తేదీ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 285 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1,97,945 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మార్చి 3న ఓట్ల లెక్కింపు
పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీ నిర్వహిస్తారు. అదే రోజు విజేతను ప్రకటిస్తారు. మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ప్రచార వ్యయంపై నిఘా పెట్టారు. ఇప్పటికే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్, జిల్లాలోని ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స్ రద్దు చేశారు.
పట్టభద్ర ఓటర్లకు అర్హతలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటు లిస్టులో ఉంటే సరిపోదు. అర్హత పత్రం కలిగుండాలి. ఓటరు ఐడీ కార్డు, పాన్‌కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, డిగ్రీ అర్హతా సర్టిఫికెట్లు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారి హోదాతో జారీ చేసే కార్డులు ఉండాలి. బీఎల్‌ఓలు ఇంటింటా పర్యటించి ఓటరు స్లిప్పులు అందజేస్తారు. స్లిప్‌లు కేవలం ఎంట్రీకి ఉపయోగపడతాయి. ఓటరు తన అర్హత పత్రాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. ఇందుకు గాను ఫారం–12ను జిల్లా రిటర్నింగ్ అధికారికి ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా సమర్పించాల్సి ఉంది. ఫారంతో పాటు డ్యూటీ కేటాయింపులతో కూడిన ఉత్తర్వుల జిరాక్స్ కాపీలు జతపర్చాల్సి ఉంటుంది.
2 వేల మంది సిబ్బంది
తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్ర ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు ఆరు జిల్లాలకు 2 వేల మంది సిబ్బందిని నియమించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభధ్రుల నియోజవకర్గ పరిధిలో 3,14,984 మంది ఓటర్లు ఉన్నారు. 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 70 జోన్లు ఏర్పాటు చేసి.. 70 జోనల్ అధికారులను, 95 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. 456 పోలింగ్ కేంద్రాల్లో ఒక పీఓ, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ విధుల్లో ఉంటారు. ఆరు జిల్లాలకు కలిపి 456 ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 456 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 456 మంది మైక్రో అబ్జర్వర్లు, 456 మంది వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. వీరితోపాటు 20 మంది రిజర్వ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు.
26న పోలింగ్ సామగ్రి తరలింపు
26వ తేదీన ఉదయం పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లనున్నారు. ఆయా జిల్లాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో 25వ తేదీ రాత్రికే ఏర్పాట్లు చేయనున్నారు.
25న ప్రచారానికి తెర
పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రచారాన్ని ఆపేయాలి.
బరిలో 35 మంది అభ్యర్థులు
పట్టబద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా కూటమి, పీడీఎఫ్ అభ్యర్థి మధ్య పోటీ నెలకొంది. మిగిలిన వారు స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నారు.
సమర్థవంతంగా నిర్వహణ
ఎన్నికల విధులు సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాలు ఏర్పాటు చేపట్టాం. ఎన్నికలు పారదర్శకంగా, శాంతీయుతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అవసరమైన అన్ని రకాలు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడైనా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలు జరిగినా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినా వారి సమాచారాన్ని సీల్డ్ కవర్లో పెట్టి సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లనున్నాం. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలపై సిబ్బందికి మాస్టర్ ట్రైనర్స్ అవగాహన కల్పిస్తారు. 27న జరిగే పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నాం.
– పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్
తేలిన ఓటర్ల లెక్క
ఉమ్మడి ‘తూర్పు’లో
1,97,945 మంది ఓటర్లు
ఈ నెల 27న పోలింగ్
285 పోలింగ్ కేంద్రాలు
ఏర్పాట్లలో అధికారుల తలమునకలు
ఉమ్మడి తూర్పులో ఓటర్ల వివరాలు..
జిల్లా పోలింగ్ కేంద్రాలు పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం
తూర్పుగోదావరి 92 36,361 26,606 3 62,970
కాకినాడ 98 42,463 28,072 5 70,504
కోనసీమ 95 37,114 27,355 2 64,471
Comments
Please login to add a commentAdd a comment