
బీసీ గురుకులాల్లో ప్రవేశ పరీక్షకు వేళాయె..
రాయవరం: మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాఠశాలల్లో 480 మంది విద్యార్థులకు ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు లభించనున్నాయి. బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఉమ్మడి జిల్లాలో 480 సీట్లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం వద్ద ఉన్న సమనస బాలుర పాఠశాలలో 80, రామచంద్రపురం బాలికల పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లా కరప బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 80, తుని బాలుర పాఠశాలలో 40, పెద్దాపురం బాలుర పాఠశాలలో 40 సీట్లు, ఇటీవల నూతనంగా పిఠాపురంలో ప్రారంభించిన పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బాలుర గురుకుల పాఠశాలలో 40, రాజమహేంద్రవరం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 40, కొవ్వూరు బాలుర ఉన్నత పాఠశాలలో 40, గోపాలపురం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 480 సీట్లకు ఎంట్రన్స్ నిర్వహిస్తారు. కోనసీమ జిల్లా సమనస పాఠశాలలో 40 శాతం (32 సీట్లు) మత్స్యకారులకు మాత్రమే కేటాయిస్తారు.
ఆబ్జెక్టివ్ తరహాలో
ఐదవ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశానికి సంబంధించి ప్రవేశ పరీక్ష 4వ తరగతి స్థాయి పరీక్ష ఉంటుంది. తెలుగు, ఇంగ్లిషు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులపై 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఇస్తారు. తెలుగు–15, ఇంగ్లిషు–25, గణితం–30, పరిసరాల విజ్ఞానం నుంచి 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు. విద్యార్థులు సమాధానాలను ఓఎంఆర్ షీట్లో గుర్తించాల్సి ఉంటుంది. జిల్లా యూనిట్‌గా ప్రవేశాలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రం వివరాలను హాల్ టిక్కెట్‌లో తెలియజేస్తారు. అభ్యర్థులు అర్హతలు పరిశీలించుకుని దరఖాస్తు చేసుకున్న తర్వాత రూ.100 చెల్లించాలి. ఫీజు చెల్లించిన వారికి నంబరును కేటాయిస్తారు. నంబరు ఆధారంగా ఆన్‌లైన్‌లో హెచ్‌టీటీపీఎస్://ఎంజేపీఏపీబీసీడబ్లూఆర్‌ఈఐఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నంబరును పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన కాలమ్‌లో నమోదు చేయాలి.
వచ్చే నెల 15 తుది గడువు
విద్యార్థులు దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 15 తుది గడువు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వత ఒక రిఫరెన్స్ నంబర్ ఇస్తారు. నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థి కులధ్రువీకరణ, ఆదాయం, పుట్టినతేదీ, ప్రత్యేక కేటగిరి ధ్రువీకరణ, స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్ పత్రాలు ఒరిజనల్స్ కౌన్సిలింగ్ సమయంలో చూపవలసి ఉంటుంది. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించరాదు. సర్టిఫికెట్లు సమర్పించకుంటే విద్యార్థి ఎంపిక అయినప్పటికీ సీటు కేటాయించరు. పరీక్ష తేదీకి ఏడు రోజులు ముందుగా రిఫరెన్స్ నంబరు ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు పోస్టులో లేదా నేరుగా పంపించరు.
దరఖాస్తు నింపే సమయంలో
ఈ సూచనలు పాటించాలి
ఫ దరఖాస్తును ఆన్‌లైన్ లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును పూరించాలి.
ఫ దరఖాస్తుదారులు సొంత జిల్లాలో మాత్రమే పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేయాలి.
ఫ పాఠశాల ప్రాధాన్యతాక్రమం ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టిక చూసుకుని పూరించాలి.
ఫ పాస్‌పోర్టు సైజ్ ఫొటోను సిద్ధం చేసుకోవాలి.
ఫ దరఖాస్తు పూరించే సమయంలో జరిగే పొరపాట్లకు విద్యార్థిదే పూర్తి బాధ్యత.
ఫ ఒకసారి దరఖాస్తును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులకు తావులేదు.
సీబీఎస్‌ఈ విద్యా
విధానం అమలు
మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లిషు మీడియం విద్య లభిస్తుంది. 9వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నాం. ప్రాథమిక తరగతుల్లో ప్రాజెక్టు బేస్డ్ లెర్నింగ్ అమలు పరుస్తున్నాం.
– డాక్టర్ వైటీఎస్ రాజు, ప్రిన్సిపాల్,
ఎంజేపీఏపీబీసీడబ్ల్యుఆర్ స్కూల్, సమనస
సద్వినియోగం చేసుకోవాలి
వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు విడుదలైన నోటిఫికేషన్‌ను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ద్రాక్షారామలో బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతికి 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఎంట్రన్స్ పరీక్షలో పాల్గొని విద్యార్థులు మెరిట్ ద్వారా సీటును సంపాదించుకోవాలి.
– వి.పావన్య, ప్రిన్సిపాల్, ఎంజెపీఏపీబీసీ
సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, ద్రాక్షారామ
దరఖాస్తు చేయాలిలా..
బీసీ, ఈబీసీ, ఇతర విద్యార్థులకు 9–11 సంవత్సరాల వయసు మించి ఉండాలి. 2014 సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి 2016 ఆగస్టు 31 తేదీ మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9–13 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 2013 సెప్టెంబరు ఒకటి నుంచి 2016 ఆగస్టు 31 మధ్యలో జన్మించి ఉండాలి. విద్యార్థులు జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందడానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. గత రెండేళ్లుగా నిరంతరంగా (2023–24, 2024–25) చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతిలో 2024–25 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉండాలి.
ఎంజేపీఏపీ బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల
480 మంది విద్యార్థులకు
5వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం
మార్చి 15 దరఖాస్తుకు తుది గడువు
ఎంపిక విధానం ఇలా..
అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి, అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేస్తారు. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటారు. సమానమైన ర్యాంక్ ఒకరి కంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ ప్రకారం అధిక వయసు ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు. సమానమైన ర్యాంకు వస్తే, గణితంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు కూడా సమానమైన ర్యాంకు వస్తే పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోనికి తీసుకుంటారు. ప్రవేశానికి ఎంపికై న వారికి మాత్రమే కాల్ లెటర్స్, ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. మెరిట్ లిస్టు మార్కుల ఆధారంగా మొదటి, రెండవ, మూడవ జాబితాను ఖాళీలను బట్టి ప్రకటిస్తారు.

బీసీ గురుకులాల్లో ప్రవేశ పరీక్షకు వేళాయె..

బీసీ గురుకులాల్లో ప్రవేశ పరీక్షకు వేళాయె..
Comments
Please login to add a commentAdd a comment