కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన ఈఎస్‌ఐ ఆసుపత్రిలో 5 గురు వైద్యులతో సహా 9 మందిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెనన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం రాజమహేంద్రవరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన విషయం తెలిసిందే. విధులను సక్రమంగా నిర్వహించని కారణంగా ఐదుగురు వైద్యులు, నలుగురు కార్యాలయ సిబ్బంది సస్పెండ్‌కు గురయ్యారు. మంత్రి ఆకస్మిక తనిఖీలో కొందరు వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు చేసుకుని విధులకు హాజరుకాకండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. హాజరు నమోదు పుస్తకాలను పరిశీలించగా, కొందరు హాజరు నమోదు చేయకపోవడం, కొందరు హాజరు నమోదు చేసి వెంటనే వెళ్లిపోవడం, మరికొందరు సమస్యలకు సరైన సమాధానం ఇవ్వకపోవడం విచారణలో తేలింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్‌ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఈఎస్‌ఐ బీమా చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, రోగుల సంరక్షణలో ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment