టీడీపీ తీరు దుర్మార్గం
రాజమహేంద్రవరం సిటీ: తునిలో టీడీపీ వ్యవరిస్తున్న తీరు పరమ దుర్మార్గంగా ఉందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దుయ్యబట్టారు. తుని మున్సిపాలిటీలో కూటమి నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా లేనప్పటికీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి దుశ్చర్యలకు పాల్పడటం శోచనీయమని మండిపడ్డారు. రాష్ట్ర మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి నిరసనగా చలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు మంగళవారం ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీనిపై జక్కంపూడి రాజా స్పందించారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లూ వైఎస్సార్ సీపీ నుంచే గెలిచారని, టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఒక్కరు కూడా గెలవలేదని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కౌన్సిలర్లను భయపెట్టడం, బెదిరించడం ద్వారా అసలు ఎన్నిక జరగకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి తెగబడటం సరి కాదన్నారు. ఆయనకు అండగా నిలవాలనే ఉద్దేశంతో చలో తునికి పిలుపునిస్తే అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నాప్‌లు, రేప్‌లు, మహిళలపై దాడుల వంటి ఘటనలపై పోలీసులు దృష్టి సారించాల్సింది పోయి, స్థానిక సంస్థలను గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే పార్టీలకు కొమ్ము కాయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రజలకు మేలు చేయడానికి, అభివృద్ధికి అధికారాన్ని ఉపయోగించుకోవాలనే తప్ప అక్రమాలకు వేదికగా చేసుకోరాదని అన్నారు. దొడ్డిదారిన వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇదే వైఖరి కొనసాగిస్తే వైఎస్సార్ సీపీ నుంచే కాకుండా ప్రజల నుంచి సైతం తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ, కూటమి శ్రేణులను జక్కంపూడి రాజా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జక్కంపూడి గణేష్ అడ్డగింపు
చలో తుని పిలుపు నేపథ్యంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ గణేష్ ఆధ్వర్యాన పార్టీ నేతలు, కార్యకర్తలు జేఎన్ రోడ్డులోని ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ మీడియాతో మాట్లాడుతూ, తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు అధికార యంత్రాంగం, పోలీసులు రక్షణ కల్పించకపోగా, తిరిగి ఆయన పైనే కేసులు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
తుని వైస్ చైర్మన్ పదవి కోసం దుశ్చర్యలకు పాల్పడుతోంది
వైఎస్సార్ సీపీ శ్రేణులను అడ్డుకోవడం శోచనీయం
వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా
టీడీపీ తీరు దుర్మార్గం
Comments
Please login to add a commentAdd a comment