కొవ్వూరు: తమను మోసం చేసి, సొమ్ము కాజేశారంటూ ధర్మవరం గ్రామానికి చెందిన బొజ్జా సింధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై బుధవారం కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై కె.శ్రీహరిబాబు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దుద్దుకూరు గ్రామానికి చెందిన కడిమి శ్రీనుబాబు, మెరిపో కృష్ణ వద్ద సింధు అప్పు తీసుకుంది. అప్పు తీర్చేందుకు ఇంటిపై రుణం ఇప్పిస్తామని చెప్పి శ్రీనుబాబు, కృష్ణ మోసపూరితంగా ఆమె వద్ద రూ.3.45 లక్షలు దఫాదఫాలుగా కాజేశారు. ఇంటిపై రుణం ఇప్పించకపోవడంతో ఆమె తన భర్తతో వెళ్లి వారిని ప్రశ్నించగా, తమపై దౌర్జన్యం చేసి, చంపుతామని బెదిరించినట్టు సింధు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
రూ.3.60 లక్షల ఎరువుల సీజ్
పిఠాపురం: గొల్లప్రోలు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కి చెందిన మన గ్రోమోర్ రిటైల్ సెంటర్‌లో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ నాగవెంకటరాజు మాట్లాడుతూ, విజిలెన్స్ ఎస్పీ స్నేహిత ఆదేశాల మేరకు, డీఎస్పీ తాతారావు పర్యవేక్షణలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి 14–35–14 రకం చెందిన 200 బస్తాల ఇన్వాయిస్ రికార్డులు సక్రమంగా లేకపోవడం, రైతుల కోసం ఫిర్యాదు బాక్స్ లేకపోవడం, స్టాక్ బోర్డ్ నిర్వహణ లేకపోవడం తదితర అంశాలను గుర్తించామన్నారు. షాపు యజమానిపై 6ఏ కేసు నమోదు చేసి, రూ 3.60 లక్షల విలువైన కాంప్లెక్స్ ఎరువులను సీజ్ చేశామన్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏఓ మధుమోహన్, గొల్లప్రోలు ఏఓ సత్యనారాయణ, తూనికలు, కొలతల అధికారి సరోజ పాల్గొన్నారు.
కాకినాడ, సామర్లకోట
రైల్వే స్టేషన్లలో తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు వాణిజ్య విభాగం బృందంతో కలసి బుధవారం కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా కాకినాడ టౌన్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, టాయిలెట్లు, వెయిటింగ్ హాళ్లు, ప్రయాణికుల సదుపాయాలు, లైటింగ్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. స్టాళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలు, వాటర్ బాటిళ్లను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం ఎమ్మార్పీకే విక్రయించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ టౌన్ స్టేషన్‌లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రూ.31.37 కోట్లతో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ప్రయాణికులు, సిబ్బంది, స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలోనూ తనిఖీలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment