టీడీపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు
తుని: సుధీర్ఘ చరిత్ర కలిగిన టీడీపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు విరుచుకుపడ్డారు. బుధవారం తుని యనమల కృష్ణుడు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తుని మున్సిపల్ కౌన్సిల్‌లో టీడీపీకి చెందిన ఒక్క కౌన్సిలర్ లేరని, బలం లేని చోట అధికార మదంతో పోలీసులు, అధికారులను ఉపయోగించుకుని బలవంతంగా లాక్కుకోవడానికి యత్నంచడం దౌర్జన్యానికి పరాకాష్ట అన్నారు. టీడీపీలో మంత్రిగా, స్పీకర్‌గా ఉన్నత పదవుల్లో ఉన్న యనమల రామకృష్ణుడు నీచ రాజకీయాలకు పాల్పడి సభ్య సమాజం నివ్వెర పోయే విధంగా వ్యవహరించారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లను బలవంతంగా టీడీపీలో చేర్చుకుని ప్రజా స్వామ్య వ్యవస్ధను నిర్వీర్యం చేశారన్నారు. మంగళవారం జరిగిన వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లను టీడీపీ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందని, మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా టీడీపీ కుట్రను దీటుగా ఎదుర్కొన్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు హయాంలో స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడు రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీకి చెందిన చోటా నాయకులతో నాపై విమర్శలు చేస్తున్నారని, ముందు మీరు నైతిక విలువలు పాటించి తర్వాత నీతులు చెబితే బాగుంటుందన్నారు. తుని వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో నాలుగు సార్లు వాయిదా పడేవిధంగా అధికారులను ప్రభావితం చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారం ఉంది కదా అని విర్ర వీగిపోతే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హితవు పలికారు.
బలం లేకపోయినా వైస్ చైర్మన్‌కు
పోటీ పడతారా?
వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు
Comments
Please login to add a commentAdd a comment