అర్ధరాత్రి దొంగల హల్‌చల్
షట్టర్లు పగులగొట్టి పది దుకాణాల్లో చోరీ
తుని: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రచ్చతో ఆందోళనకు గురైన ప్రజలకు దొంగలు కంటిపై కునుకు లేకుండా చేశారు. తుని పట్టణంలో రద్దీగా ఉండే జీఎన్‌టీ రోడ్డులో ఒకేసారి పది దుకాణాల షట్టర్లను పగులగొట్టి, అందిన కాడికి దోచుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక దొంగల ముఠా ఏకకాలంలో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఆయా దుకాణాల్లో సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. తుని పట్టణంతో పాటు, పాయకరావుపేటలోనూ చోరీలకు యత్నించారు. పెద్ద ముఠాయే ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం ఆయా దుకాణాల్లో సీసీ ఫుటేజ్‌తో పాటు, దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ గీతారామకృష్ణ తెలిపారు. వస్త్ర దుకాణంలో దుస్తులు పట్టుకెళ్లారని, మిగిలిన దుకాణాల్లో నగదును దొంగిలించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చోరీలకు పాల్పడిన ముఠా ఒడిశా రాష్ట్రానికి చెందినదిగా సీసీ ఫుటేజ్‌లో గుర్తించామన్నారు. ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment