వేగంగా డేటా నవీకరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సర్వే సమయంలో ఇంటి వద్ద లేని సిటిజన్ల హౌస్ హోల్డ్ డేటా పెండింగ్ లేకుండా ప్రతి శాఖకు చెందిన లబ్ధిదారుల, అర్హుల జాబితాను అనుసరించి క్రమబద్ధీకరించాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో మిస్సింగ్ హౌస్ హోల్‌ర్‌స్డ్ పై సమన్వయ శాఖల అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1,65,278 మంది మిస్సింగ్ హౌస్ హోల్డ్ ఉన్నట్లు తెలిపారు. అందులో ఇప్పటికీ ఇంకా 48,232 మంది వివరాలను గుర్తించి డేటా ఎంట్రీ చెయ్యాల్సి ఉందన్నారు. నూరుశాతం మిస్సింగ్ హౌస్ హోల్డ్ గుర్తించడంలో భాగంగా వలస వెళ్లిన, మరణించిన వారి వివరాలు సచివాలయాలు వారీగా గుర్తించి నవీకరించాలన్నారు. విద్యుత్ శాఖ 16,082, పౌర సరఫరాల శాఖ 7,889 , విద్యా శాఖ 5,799 , ఆరోగ్యశ్రీ 5,426 , డ్వామా 4,685 , సర్వే 4,677 పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ ఆధారంగా వారి వివరాలు సేకరించి నవీకరణ చేయాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి టీ సీతారామమూర్తి , డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులు పి వీణాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పర్యాటక రంగ అభివృద్ధికి చొరవ
రానున్న ఆగస్టు నాటికి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులు కార్యరూపం దాల్చే విధానం చొరవ తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పర్యాటక కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన నిర్వహించగా, ఇంచార్జి జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్ర దామా, జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామ మూర్తి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి వివిధ ఏజెన్సీలను గుర్తించి చర్యలను చేపట్టాల్సి ఉందన్నారు. జాతీయ రహదారి 216–ఏ పర్యాటక ప్రాంతంగా నర్సరీల స్టాల్స్‌ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిని గుర్తించాలన్నారు. కడియం నర్సరీలు, ఫ్లవర్ మార్కెట్ వర్గాలు, స్వయం సహక సంఘాలు, చేనేత కుటుంబాలను గుర్తించి లీజ్ పద్ధతిలో షాప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కడియపులంక ప్రాంతంలో బోటింగ్ సౌకర్యం ఒక కిలోమీటర్ తో చేపట్టి, దశల వారీగా నిడివి పెంచుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment