పౌల్ట్రీ.. నష్టాల పల్టీ
రూ.లక్షల్లో నష్టం
కోళ్లున్నా, గుడ్లు ఉత్పత్తి అవుతున్నా మార్కెట్లో ధరలు లేక ఇబ్బందులు పడుతున్నాం, ప్రతి రోజూ మేత ఖర్చులు, విద్యుత్ బిల్లులు, బర్డ్‌ప్లూ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలకు పెట్టుబడి తడిపి మోపెడవుతోంది. ఇంత చేసినా వినియోగం లేకపోవటంతో రూ.లక్షల్లో నష్టపోవలసి వస్తోంది.
– మండ తాతారెడ్డి, పౌల్ట్రీ యజమాని, పిట్టల వేమవరం, పెరవలి మండలం
దిక్కు తోచడం లేదు
ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర రూ.4.20 మాత్రమే ఉంది, ప్రస్తుత మేత ధరల ప్రకారం గుడ్డుకు రూ.5.50 వస్తేనే పెట్టుబడి దక్కుతుంది. రానున్న వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. దీనివలన ఖర్చులు మరింత పెరుగుతాయి. వినియోగం, ధరలు పడిపోయి రూ.లక్షల్లో నష్టపోతున్నాం. దిక్కు తోచడం లేదు.
– భూపతిరాజు వరహాలరాజు,
కోళ్ల రైతు, ఖండవల్లి, పెరవలి మండలం
బాగా ఉడికిస్తే హాని ఉండదు
బర్డ్‌ప్లూ సోకిన ఫామ్‌ల నుంచి కిలోమీటర్ పరిధిలోని ప్రజలు చికెన్, గుడ్లు వినియోగించవద్దని గతంలో ప్రకటించాం. అలాగని మొత్తంగా గుడ్లు, చికెన్ తినవద్దని కాదు. వీటిని 75 డిగ్రీల సెంటీగ్రేట్ వేడిలో ఉడికించి నిరభ్యంతరంగా తినవచ్చు. ఎటువంటి హానీ ఉండదు. చికెన్ బాగా శుభ్రపరచుకోవాలి. గుడ్లు, చికెన్ తినవచ్చంటూ అవగాహన కల్పించేందుకు ప్రధాన పట్టణాల్లో చికెన్, గుడ్డు మేళాలు నిర్వహిస్తున్నాం.
– సీహెచ్ చరణ్, పశువైద్యాధికారి, పెరవలి
●
● బర్డ్‌ప్లూతో కుదేలైన కోళ్ల పరిశ్రమ
● తగ్గిన గుడ్లు, చికెన్ వినియోగం
● గుడ్లు తేలేస్తున్న పౌల్ట్రీ యజమానులు
పెరవలి: గత నెలలో వ్యాప్తి చెందిన బర్డ్‌ప్లూ వ్యాధితో జిల్లాలో కోళ్ల పరిశ్రమ కుదేలైంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు మృత్యువాత పడటంతో ప్రస్తుతం కోళ్లఫామ్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉన్న ఫామ్‌ల నుంచి ఉత్పత్తి అవుతున్న గుడ్లు, కోళ్లు కొనే నాథుడు లేక తీవ్ర నష్టాలు చవి చూస్తున్నామని పౌల్ట్రీల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం మిగిలి ఉన్న కోళ్ల నుంచి రోజుకు 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నా, వినియోగం లేక, ధర పెరగక రోజుకు రూ.కోటి పైగా నష్టపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం మిగిలి ఉన్న కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకకపోయినా చికెన్, గుడ్ల వినియోగంపై ప్రజల్లో ఒక విధమైన ఆందోళన నెలకొంది. దీంతో వీటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో, ఏం చేయాలో తెలియక పౌల్ట్రీల యజమానులు గుడ్లు తేలేస్తున్నారు. ఒకవైపు కోళ్లను మేపక తప్పడం లేదని, మరోవైపు దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర లభించక, గుడ్ల ఎగుమతులు లేక నష్టాలు ఎదుర్కొంటున్నారు. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తమ పరిస్థితి మారిందని ఆవేదన చెందుతున్నారు.
షెడ్లు ఖాళీ
అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని పౌల్ట్రీల్లో సుమారు 1.50 కోట్ల కోళ్లు పెంచుతూంటారు. చాలా వరకూ 50 వేలకు పైగా కోళ్లను పెంచగలిగే సామర్థ్యం కలిగిన పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవి కాకుండా 5 వేల నుంచి 40 వేల కోళ్ల సామర్థ్యం కలిగిన మరికొన్ని ఫామ్‌లలో మరో కోటి కోళ్లను పెంచుతున్నారు. అనపర్తి నియోజకవర్గంలో 70 లక్షలు, నిడదవోలులో 50 లక్షలు, గోపాలపురం, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల్లో మరో 30 లక్షల కోళ్ల పెంపకం జరుగుతోంది. గత నెలలో బర్డ్‌ప్లూ బారిన పడి 40 లక్షలు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో ప్రజలు చికెన్, గుడ్ల వినియోగం బాగా తగ్గించారు. దీంతో ఒకవైపు బ్రాయిలర్ కోళ్ల పెంపకం నిలిచిపోయింది. మరోవైపు గుడ్ల కోళ్ల ఉత్పత్తి జరుగుతున్నా వినియోగం తగ్గిపోవడంతో ఎక్కడికక్కడ గుడ్లు పేరుకుపోతున్నాయి. బ్రాయిలర్ కోళ్లు పెంచిన రైతులు బర్డ్‌ఫ్లూతో రూ.2 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ, లేయర్ కోళ్ల రైతులు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో వారు మళ్లీ కోళ్ల పెంపకం చేపట్టడానికి ధైర్యం చేయడం లేదు. చాలాచోట్ల బ్రాయిలర్ కోళ్లు వేయకుండా షెడ్లను ఖాళీగా వదిలేశారు. పెరవలి మండలంలో నిత్యం లక్ష బ్రాయిలర్ కోళ్లు పెంచేవారు. నేడు అవి మచ్చుకు కూడా కనిపించటం లేదు.
గుడ్డు ధర పతనం
జిల్లాలో కోడి గుడ్ల ఉత్పత్తి ఉన్నా వినియోగం తగ్గిపోవడంతో ధర పతనమైంది. కోళ్ల ఫామ్‌ల వద్ద గత డిసెంబర్‌లో గుడ్డు ధర రూ.6.15 ఉండగా.. ఈ నెల మొదటి వారంలో అది రూ.4.50కి, గురువారం నాటికి రూ.4.20కి పడిపోయింది. బర్డ్‌ఫ్లూ బారిన పడి కోళ్లు పిట్టల్లా రాలిపోయినా కోడి పిల్లల ధర మాత్రం రూ.50కు తగ్గటం లేదు. మృత్యువాత పడిన కోళ్ల స్థానంలో మరో బ్యాచ్ పెంచుదామనుకున్నా గుడ్డు ధరలు నానాటికీ పతనమవుతూండటంతో నష్టపోతున్నామని కోళ్ల రైతులు వాపోతున్నారు. మరోవైపు మేత ధరలు కూడా కొండెక్కాయి. దీంతో, ఉన్న కోళ్లను మేపలేక, పెరిగిన మేత ధరలు తట్టుకోలేక వారు ఇబ్బందులు పడుతున్నారు.
కోళ్ల మేత ధరలు పెరిగాయిలా.. (టన్నుకు రూ.లు)
మేత డిసెంబర్ మార్చి
చేప 48,000 55,000
మొక్కజొన్న 18,000 25,000
నూకలు 20,000 25,000
సోయా 40,000 45,000
తవుడు 15,000 18,000
పౌల్ట్రీ.. నష్టాల పల్టీ
పౌల్ట్రీ.. నష్టాల పల్టీ
పౌల్ట్రీ.. నష్టాల పల్టీ
పౌల్ట్రీ.. నష్టాల పల్టీ
పౌల్ట్రీ.. నష్టాల పల్టీ
Comments
Please login to add a commentAdd a comment