చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
ఏలేశ్వరం: గత నెల 9వ తేదీన పట్టణంలోని ప్రధాన రహదారిని అనుకుని ఉన్న జ్యూయలరీ షాపులో జరిగిన చోరీలో ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ వివరాలు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అత్తిరాల గ్రామానికి చెందిన కరణం కుమార్, కడప జిల్లా అట్లూరు మండలం చలంగారేపల్లి గ్రామానికి చెందిన గుమ్మళ్ల వెంకట సుబ్బయ్య కలిసి చోరీకి పాల్పడ్డారన్నారు. మండల పరిధిలోని తిరుమాలి జంక్షన్‌లో రాథాస్వామి సత్సంగ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి చోరీ సొత్తు 32.8 గ్రాముల బంగారం, 11.5 కేజీల వెండి రికవరీ చేశామన్నారు. దీంతో పాటు ఇద్దరు ముద్దాలు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. నక్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలో 20.450 గ్రాముల బంగారం, తుని పోలీస్‌స్టేషన్ పరిధిలో బజాజ్ పల్సర్‌బైక్, ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 13గ్రాముల బంగారం రికవరీ చేశామన్నారు. ముద్దాయి కరణం కుమార్‌పై 30 వరకు దొంగతనం కేసులు ఉండగా కాకినాడ పీఎస్ పరిధి కేసులో 14 ఏళ్ల జైలు శిక్షపడగా బెయిల్‌పై బయటకు వచ్చాడన్నారు. మరో ముద్దాయి గుమ్మళ్ల వెంకటసుబ్బయ్యపై 11 ఎర్రచందనం కేసులు, 10 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. వేర్వేరు కేసుల్లో 2023లో కడప జైలులో వీరు కలుసుకున్నారన్నారు. ఇప్పటివరకు నాలుగు జ్యూయలరీ షాపుల్లో చోరీలు చేశారన్నారు. సీఐ సూర్యఅప్పారావు, ఏలేశ్వరం, అన్నవరం, రౌతులపూడి ఎస్సైలు రామలింగేశ్వరరావు, హరిబాబు, వెంకటేశ్వరావు, అన్నవరం అడిషనల్ ఎస్సై ప్రసాద్‌లను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీహరిరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment