
వర్గీకరణ బిల్లును వెంటనే విరమించుకోవాలి
రాజమహేంద్రవరం రూరల్: ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఆమోదించడంపై ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ బిల్లును విరమించుకునేంత వరకూ, చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ సమితి ఆధ్వర్యాన స్థానిక మోరంపూడి జంక్షన్‌లో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం కూట మి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోరంపూడి జంక్షన్‌లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా పోరాట సమితి నాయకులు ఇసకపట్ల రాంబాబు, పరమట గణేశ్వరరావు, చీరా రాజు, ఆరే చిన్ని, ఎలుగొండ లక్ష్మి (చెల్లాయమ్మ) మాట్లాడుతూ, రాజ్యాంగ విరుద్ధంగా, సహజ సూత్రాలకు వ్యతిరేకంగా ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లును విరమించుకోకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టి రాజ్యాధికారం సాధించకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ చట్ట విరుద్ధమన్నారు. వర్గీకరణ పేరుతో రాజకీయ పబ్బం గడుపుకొంటున్న చంద్రబాబు.. మాలలకు తీవ్ర అన్యాయం చేస్తున్నార ని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ చేయడం లేదని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ పార్టీని ప్రశ్నించగలరా అని నిలదీశారు. కులగణన చేసిన తరువాతే వర్గీకరణ జోలికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. మంద కృష్ణ మాదిగ చెప్పిన కాకి లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మాలల విశ్వరూపం చూపించి, చంద్రబాబు కు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment