ప్రియురాలిని, ఆమె తల్లిని హత్య చేసిన ప్రియుడి అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్: ప్రియురాలిని, ఆమె తల్లిని హత్యచేసిన ప్రియుడు పల్లి శివకుమార్‌ను బొమ్మూరు పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఆ వివరాలను సోమవారం రాత్రి రాజమహేంద్రవరం ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. మృతిచెందిన మహమ్మద్ సల్మా(37), ఆమె కుమార్తె మహమ్మద్ సుమయ్య(16) హుకుంపేట డిబ్లాకులో నివసిస్తున్నారు. సుమయ్య పెళ్లి ఈవెంట్లు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఈవెంట్లు చేస్తున్న సమయంలో ఈ కేసులో నిందితుడైన శ్రీకాకుళం జిల్లా నందిగాం గ్రామానికి చెందిన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న పల్లి శివకుమార్‌తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. పల్లి శివకుమార్ హైదరాబాద్‌లో నివసిస్తూ అక్కడ పనిచేసేవాడు. మృతిచెందిన సుమయ్యకు ఫోన్ చేసే సమయంలో ఆమె ఫోన్ వెయిటింగ్ వస్తే ఆమెను అనుమానిస్తూ, సుమయ్యతో గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో ఆరురోజుల క్రితం శివకుమార్ మృతుల ఇంటికి వచ్చి వాళ్లతో గొడవపడి చంపుతానని బెదిరించాడు. సుమయ్యకు ఇంకెవరితోనో మాట్లాడేందుకు, ఆమె తల్లి సల్మా సహకరిస్తోంది అనే ఉద్దేశంతో శివకుమార్ ఆదివారం ఉదయం 8.00గంటల సమయంలో సుమయ్య, ఆమె తల్లి సల్మాలను వారి ఇంటిలోనే కత్తితో పొడిచి హత్యచేసి ఇంటికి తాళంవేసి పరారయ్యాడు. మృతురాలు మహమ్మద్ సల్మా కుమారుడు మహమ్మద్ ఆలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేశారు. ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆదేశాల మేరకు ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య ఆధ్వర్యంలో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి శివకుమార్‌ను కొవ్వూరు రూరల్ పోలీసులు గుర్తించి అదుపులోనికి తీసుకుని, బొమ్మూరు పీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథ్, సిబ్బందితో వెళ్లి శివకుమార్‌ను అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. బొమ్మూరు పీఎస్ ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథ్, ఎస్సై సీహెచ్‌వీ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment