
పాము కాట్లకు ఇద్దరి మృతి
మామిడికుదురు/ముమ్మిడివరం: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం పాము కాట్లకు గురై ఇద్దరు మృతి చెందారు. మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలో శుక్రవారం కంచి శృతిప్రియ (24) ఇంటి బయట ఉన్న బట్టలు తీస్తుండగా బట్టల్లో దాగి ఉన్న పాము ఆమె చేతిపై కాటు వేసింది. స్థానికులు ఆమెను వెంటనే రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతి తండ్రి మోహనరావు తాపీమేస్త్రి, తల్లి మంగాదేవి ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద అమ్మాయికి వివాహమైంది. రెండో కుమార్తె శృతిప్రియ మృతితో ఆమె కుటుంబ సభ్యులు కున్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె బీఎస్సీ చదువుకుంది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ కేఎన్ ప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టారు.
అలాగే ముమ్మిడివరం మండలం అయినాపురం రామారావు పేటకు చెందిన దోనిపాటి వెంకటేశ్వరరావు (44) ఒక రైతు పొలంలో కొబ్బరికాయలు పోగుచేస్తుండగా పాము కాటు వేసింది. దీంతో అతడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అతడిని స్థానికులు ముమ్మిడివరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అతనికి భార్య కనకలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ జీబీ స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు.