అతి వేగానికి ఇద్దరు యువకుల బలి
● మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన కారు
● ఒకరు అక్కడికక్కడే మృతి, మరొకరు
ఆసుపత్రిలో..
● కన్నీరు మున్నీరుగా విలపించిన
కుటుంబ సభ్యులు
పెరవలి: అతి వేగం ఇద్దరు యువకులను బలి తీసుకుంది. జాతీయ రహదారిపై పెరవలి మండలం అన్నవరప్పాడు సెంటర్‌లో రోడ్డు దాటుతుండగా మోటార్ సైకిల్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. పెరవలి ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరరావు తెల్పిన వివరాలిలా ఉన్నాయి. పెరవలి మండలం పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేష్ (26), నేతల హనుమంతు (26) అన్నవరప్పాడు సెంటర్‌లో మోటార్ సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా అదే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు వచ్చిన వేగానికి మోటార్ సైకిల్ గాలిలోకి ఎగిరి సుమారు 20 మీటర్ల దూరంలో పడి ఆగిఉన్న మరో కారును ఢీకొట్టి పడిపోయింది. దీంతో మాకా సురేష్ తలకు బలమైన గాయం అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు, మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన వెంటనే పెద్ద శబ్దం రావటంతో సెంటర్‌లో ఉన్న జనం పరుగున వచ్చి పడిపోయిన ఇద్దరిని లేపటానికి ప్రయత్నించారు. వీరిలో మాకా సురేష్‌లో ఎటువంటి కదలిక లేదు. నేతల హనుమంతు కదులుతుండటంతో హైవే అంబులెన్స్‌కు ఫోన్ చేయటంతో వెంటనే వచ్చి తణుకులో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి వచ్చిన సురేష్ తండ్రి వెంకటేశులు, తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. తీవ్ర గాయాలైన నేతల హనుమంతు తండ్రి ప్రసాద్, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లే సమయానికి కుమారుడు మృతి చెందాడని తెలిసి హతాశులయ్యారు. మాకా వెంకటేశులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కుటుంబాలకు వీరే ఆధారం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి కుటుంబీకులు పేదలు. రెండు కుటుంబాలకు వీరే ఆధారం. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు, కుమారులు మృతితో ఇరు కుటుంబాలు తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నాయి. మాకా వెంకటేశులు, భార్య ధనలక్ష్మిలకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు సురేష్. ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేశారు. తల్లి తండ్రులకు సురేష్ ఒక్కడే ఆధారం. అతను ఇలా రోడ్డు ప్రమదంలో మృతి చెందడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
నేతల హనుమంతు తండ్రి ప్రసాద్, కృష్ణవేణిలకు ముగ్గురు పిల్లలు పుట్టగా హనుమంతు అన్న మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం మృతుడి చెల్లికి వివాహం జరిగింది. ఇప్పడు రోడ్డు ప్రమాదంలో హనుమంతు మృతిచెందటంతో తల్లితండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. హనుమంతు తెచ్చిన కూలి డబ్బులే ఈ కుటుంబానికి జీవనాధారం కావటంతో తల్లితండ్రులు బిడ్డ పోయాడని ఒకవైపు రోదిస్తూ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అంటూ విలపిస్తుంటే చూపరులు కూడ కన్నీటి పర్యంతం అయ్యారు. తల్లితండ్రులు ఇద్దరు భగవంతుడా మీకు ఏమి అన్యాయం చేశాము, ఈ చివరి క్షణాల్లో మమ్మల్ని ఆదుకునేదెవరు, ఒక బిడ్డను ముందు తీసుకెళ్లావు. అది మర్చిపోకముందే రెండవ బిడ్డను తీసుకెళ్లిపోయావా అంటూ హృదయ విదారకంగా విలపించారు.
అతి వేగానికి ఇద్దరు యువకుల బలి
అతి వేగానికి ఇద్దరు యువకుల బలి
అతి వేగానికి ఇద్దరు యువకుల బలి
అతి వేగానికి ఇద్దరు యువకుల బలి
Comments
Please login to add a commentAdd a comment