
కొండపై కోటరీల కుమ్ములాట
ఇక్కడ పని చేయలేమంటూ..
● అన్నవరం దేవస్థానంలో పని చేయలేమంటూ పలువురు వెళ్లిపోతున్నారు.
● అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రామ్మోహనరావుకు గత ఈఓ, ప్రస్తుత కమిషనర్ రామచంద్ర మోహన్‌కు సన్నిహితుడనే ముద్ర ఉంది. రామ్మోహనరావు అన్నవరం నుంచి రాజమహేంద్రవరం, పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో పని చేసి, అన్నవరం తిరిగి వచ్చారు. నాలుగు నెలల్లో రిటైర్ కానున్న తరుణంలో ఆయన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారు.
● అన్నదానం ఏఈఓ భ్రమరాంబ సిక్ లీవ్‌పై కొండ దిగిపోయారు.
● విజయవాడ నుంచి డెప్యూటేషన్‌పై వచ్చి, అన్నవరంలో పని చేస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ వీఆర్‌ఎస్‌కు అర్జీ పెట్టుకున్నారు.
● సీనియర్ అసిస్టెంట్ ఓలేటి జగన్నాథం, ఇద్దరు ఏఈఓలు జగ్గారావు, శ్రీనివాస్ సెలవు పై వెళ్లిపోయేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
● ఎన్నో ఏళ్లుగా ఆలయంలో సెక్యురిటీ గార్డులుగా పని చేస్తున్న 10 మందిని అకస్మాత్తుగా తొలగించేశారు. ఆలయానికి వస్తున్న చినబాబును సరైన రీతిలో స్వాగతించడం లేదనే కారణంతో తమను తొలగించేశారని వారంతా ఎమ్మెల్యేల వద్ద మొర పెట్టుకున్నారు.
● సత్యదేవుని సన్నిధిలో ఇదేం నిర్వాకం!
● అవమానంతో కొండ దిగుతున్న సేవకులు
● వీఆర్‌ఎస్, సెలవులకు క్యూ
● రత్నగిరిపై గాడి తప్పిన పాలన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సత్యదేవుని సన్నిధి కోటరీలకు కేంద్ర బిందువుగా మారింది. అగ్రరాజ్యం అమెరికాలో సైతం వ్రతాలు నిర్వహించిన ఖండాంతర ఖ్యాతి వీర వేంకట సత్యనారాయణస్వామి వారి సొంతం. కార్తిక మాసంతో పాటు పండుగలు, వివాహాది శుభకార్యాలప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచీ వేలాదిగా తరలివచ్చే భక్తులతో అన్నవరం రత్నగిరి కళకళాడుతూంటుంది. భక్తవరదుడైన సత్యదేవుడు స్వయంభువుగా వెలసిన ఈ కొండపై స్వామివారికి, భక్తులకు సేవలందించాల్సిన అధికారులు.. కుమ్ములాటలతో ఈ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇక్కడ వివిధ క్యాడర్లలో పని చేస్తున్న 250 మంది రెగ్యులర్, వెయ్యి మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు.. రెండు కోటరీల మధ్య నలిగిపోతున్నారు. దేవస్థానంలో గాడి తప్పిన పాలనపై జిల్లా కలెక్టరే స్వయంగా జోక్యం చేసుకునే పరిస్థితులు ఉత్పన్నం కావడం ఆలయ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. మునుపెన్నడూ లేని రీతిలో కొండపై రెండు కోటరీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.
ఆలయ కార్యనిర్వహణాధికారులు(ఈఓ)గా దేవదాయ శాఖ నుంచే కాకుండా రెవెన్యూ శాఖ నుంచి కూడా ఎంతో మంది తమ సేవల ద్వారా ప్రశంసలు పొందారు. కారణాలేవైనప్పటికీ దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం ఇటీవల ఆలయ పాలనా వ్యవహారాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ విభాగాల ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడుతోంది. పరస్పర ఫిర్యాదులతో అన్నవరం సత్యదేవుని ఆలయం రాష్ట్ర స్థాయిలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రెవెన్యూ శాఖకు చెందిన వీర్ల సుబ్బారావు గత డిసెంబర్ 14న ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ముందు ఇక్కడ ఈఓగా పని చేసిన కె.రామచంద్ర మోహన్ ప్రస్తుతం దేవదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. అన్నవరం ఈఓగా పని చేసిన కాలంలో కొన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు ఆయనకు నమ్మిన బంట్లుగా ఉండేవారు. వారందరినీ రామచంద్ర మోహన్ కోటరీగా చెప్పుకునేవారు. ఆ కోటరీలో ఉన్న వివిధ విభాగాల ఏఈఓలు, ఇతర విభాగాల ఉద్యోగులు ప్రస్తుతం అవమానాలు ఎదుర్కొంటున్నారనే చర్చ ప్రస్తుతం కొండపై నడుస్తోంది. నాడు రామచంద్ర మోహన్‌కు నమ్మకస్తులమనే ముద్ర వలన ఇప్పుడు తమ పని తాము చేసుకునే పరిస్థితులు లేకుండా పోయాయని వారు అంటున్నారు.
వివాదాస్పద నిర్ణయాలతో..
దీనికి తోడు తాజాగా కొండపై సీతారామ సత్రం శంకుస్థాపన వ్యవహారం కమిషనర్ రామచంద్ర మోహన్‌కు, ఈఓ సుబ్బారావుకు మధ్య అగాధాన్ని మరింత పెంచిందంటున్నారు. సత్రం శంకుస్థాపన సమాచారం తనకు చెప్పకుండా నేరుగా దేవదాయ శాఖ మంత్రికి ఈఓ తెలియజేయడం కమిషనర్ ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు.
ప్రిన్సిపాల్ పోస్టింగ్‌పై..
సత్యదేవుని విద్యా సంస్థలో ఎఫ్‌ఏసీగా పని చేస్తున్న రామ్మోహనరావుకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ పోస్ట్ ఇవ్వడం పెద్ద దుమారం రేపుతోంది. రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా ఇవ్వాలంటే పీహెచ్‌డీ తప్పనిసరి అని తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీ నిర్దేశించిన మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉందని చెబుతున్నారు. నిబంధనలు అనుమతించనందువల్లనే రామ్మోహనరావుకు గతంలో రామచంద్ర మోహన్ రెగ్యులర్ పోస్టింగ్ తిరస్కరించారు. ఈ పోస్టుకు ప్రధాన అర్హత లేకున్నా, నేషనల్ ఎలిజిబిలిటీ, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ ఉందంటూ ప్రస్తుత ఈఓ పోస్టింగ్ ఎలా ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సన్నిహితుడు కావడమే అర్హతగా ఈ పోస్టు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. సత్యదేవుని ఆలయంలో గతంలో జరిగిన నియామకాల్లో లోపాలున్నాయంటూ పాత ఫైల్స్ తిరగేస్తున్న ఈఓ.. ఎఫ్‌ఏసీలో ఉన్న వారికి రెగ్యులర్ ప్రిన్సిపాల్ పోస్టు ఇవ్వడంలో ఔచిత్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టింగ్ విషయంలో ఈఓ సన్నిహితుడికి వ్యతిరేకంగా పని చేసినందుకు అవమానిస్తున్నారనే మనస్తాపంతో ఈఓ పేషీ, వ్రతాలు పర్యవేక్షించే సూపరింటెండెంట్ కంచి మూర్తి అనారోగ్య కారణాలతో సింహాచలం దేవస్థానానికి బదిలీపై వెళ్లిపోయారని చెబుతున్నారు.
గాడి తప్పిన పాలనపై ఫిర్యాదులు
ఉద్యోగులు సెలవులు, వీఆర్‌ఎస్‌లు పెడుతున్న క్రమంలో అన్నవరం దేవస్థానంలో పాలన గాడి తప్పిందంటూ కమిషనర్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇటీవల కొండపై అన్నింటా తానే అన్నట్టు ఓ అధికారి పుత్రరత్నం ‘చినబాబు’ వ్యవహరిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ సైతం తీవ్రంగా పరిగణించారని తెలియవచ్చింది. రెవెన్యూలో పని చేస్తున్న ఈఓ సుబ్బారావు అక్కడి నుంచి అన్నవరం దేవస్థానానికి రావడానికి సిఫారసు లేఖలిచ్చిన ప్రజాప్రతినిధులే.. పాలన గాడి తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం