
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సుమారు నెలరోజులకు బయటపడిన వైనం
కొవ్వూరు: మద్దూరులంక గ్రామంలో పల్లెపాలెంలో ఆకుల కృష్ణారావు అనే రైతుకి చెందిన మకాం సమీపంలో చిత్రాపు వెంకట్రావు మృతదేహాన్ని గుర్తించారు. సుమారు నెల రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని రూరల్ పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా ఎండిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు ఘటనా స్ధలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఆరునెలలు క్రితమే మృతుడు వెంకట్రావు భార్య రామజ్యోతి తొమ్మిది నెలలు గర్భవతిగా ఉన్న సమయంలో గుండె పోటుతో మృతి చెందారు. అప్పటి నుంచి వెంకట్రావు ఒంటరిగా ఉంటున్నారు. గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఎస్సై చెప్పారు. ఆమె ఇటీవల హైదరాబాద్ వెళ్లిపోయింది. వెంకట్రావు తల్లిదండ్రులు పదిహేహేనేళ్ల కిత్రమే మృతి చెందారు. దీంతో తన సోదరుడు ఒక ఫోర్షన్‌లోను వెంకట్రావు మరో పోర్షన్‌లోను నివాసం ఉంటున్నారు. అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవడం లేదని స్ధానికులు చెబుతున్నారు. ఘటనా స్ధలంలో లభ్యమైన మొబైల్ ఫోన్ ఆధారంగా శవం వెంకట్రావుది అని నిర్ధారించారు. మార్చి 20వ తేదీన చివరి కాల్ చేసి ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలంలో లభ్యమైన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహానికి సమీపంలోనే గుళికలు డబ్బా ఉండడాన్ని బట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. వెంకట్రావు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. దీంతో అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీహరిరావు తెలిపారు.