సర్వేల జోస్యాన్ని నిజం చేస్తూ ఇజ్రాయెల్ ఎన్నికల్లో లికుడ్ పార్టీ నేతృత్వంలోని అతి మితవాద, మత, ఛాందసవాద పార్టీల కూటమి ఘనవిజయం సాధించింది. ఆ కూటమి 120 స్థానాలున్న పార్లమెంటులో 64 గెల్చుకుని సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలెట్టింది. ఈ నెల 1న జరిగిన ఈ ఎన్నికలు మితవాద పక్షాలకు దేశ చరిత్రలో తొలిసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకామిచ్చాయి. అవినీతి ఆరోపణల్లో విచారణ నెదుర్కుంటూ రాజకీయంగా మసకబారుతున్న విపక్ష లికుడ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఈ ఫలితాలు తిరుగులేని నేతగా స్థిరపరిచాయి.
నాలుగేళ్లకోసారి జరగాల్సిన పార్లమెంటు ఎన్నికలు అస్థిర రాజకీయాల కార ణంగా మూడున్నరేళ్లలో అయిదోసారి వచ్చిపడటంతో దేశ పౌరులు విసుగుచెందారనీ, పరస్పరం పొసగని పక్షాలున్న కూటమిని నమ్ముకోవటం కంటే పక్కా మితవాదంవైపు పోవటమే సరైందన్న నిర్ణయానికొచ్చారనీ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు గద్దె దిగబోతున్న మధ్యేవాద కుడి, ఎడమ పక్షాలు, అరబ్‌ల పార్టీల కూటమి ప్రభుత్వం దేశంలో సామరస్యత నెలకొల్పడం మాట అటుంచి మెరుగైన ఆర్థికాభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకోలేకపోయింది. ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్ని అరికట్టలేకపోయింది.
అందుకే ఆ కూటమి 51 సీట్లకు పరిమితమైంది. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో పదవీభ్రష్టుడైన నెతన్యాహూ ఆ కూటమి వైఫల్యాలను పూర్తిగా తనకనుకూలంగా మార్చు కోగలిగారు. జియోనిస్టు పార్టీ, మరో రెండు తీవ్ర ఛాందసవాద పక్షాలనూ కలుపుకొని కూటమి కట్టారు. మూడు దశాబ్దాలుగా పార్లమెంటులో చెప్పుకోదగ్గ స్థానాలతో వెలిగిన వామపక్షం మెరెట్జ్ ఈసారి కొన్ని వేల ఓట్లకే పరిమితమై చట్టసభకు వెలుపలే ఉండిపోయింది.
సమస్యల మాటెలా ఉన్నా మితవాద కూటమి అధికారం మెట్లెక్కడంలో మీడియా ప్రధాన పాత్ర పోషించింది. జియోనిస్టు పార్టీ నేత బెన్ గవీర్‌కు అపరిమితమైన ప్రచారమిచ్చి ఆయన పార్టీ దూసుకుపోయేందుకు దోహదపడింది. ఈ ప్రచారం ఏ స్థాయిలో సాగిందంటే ఆయనతో కూటమి కట్టి లాభపడిన నెతన్యాహూ సైతం అది మోతాదు మించిందని అంగీకరించాల్సి వచ్చింది. ఇదిగాక వాట్సాప్, టెలిగ్రాం యాప్‌లలో వందకుపైగా గ్రూపులు ఏర్పాటుచేసి బెన్ గవీర్ స్వీయ ప్రచారంతో హోరెత్తించారు. ఎప్పటికైనా ప్రజా భద్రతా మంత్రినవుతానని బెన్ గవీర్ నిరుడు జోస్యం చెప్పిన ప్పుడు ఆ పదవికి ఆయన పనికిరాడని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు.
తీరా రాజకీయ అవసరాల రీత్యా అదే పార్టీతో కూటమి కట్టక తప్పలేదు. ఇప్పుడాయనను మంత్రిని చేసి, ప్రజా భద్రత శాఖ అప్పగించినా ఆశ్చర్యం లేదు. స్వదేశంలోనే యూదులకు రక్షణ కరువైందనీ, ఉగ్రవాదులు ఏ నిబంధనలకూ లోబడకుండా దాడులు చేస్తుంటే వారిపై పోరాడే సైనికులకు నిబంధనలు సంకెళ్లుగా మారుతున్నాయనీ బెన్ గవీర్ తరచు వాపోయేవారు. ఈ మాదిరి ఉపన్యాసాలు యూదుల్ని బాగా ఆకట్టుకున్నాయి. పైగా 1994లో ఒక మసీదులో తలదాచుకున్న 29 మంది పాలస్తీనా పౌరులను ఊచకోత కోసిన బరూక్ గోల్డ్‌స్టీన్‌ను ఆయన తన ఆరాధ్యదైవంగా చెప్పుకుంటారు.
సంక్షోభం ఆవరించిన సమాజంలో ఉద్రేకపూరిత ఉపన్యాసాలు జనాన్ని ప్రభావితం చేస్తాయి. బెన్ గవీర్ ఆ పని సమర్థవంతంగా చేయగలిగారు. మధ్యేవాద మితవాద పక్షం యామినా పార్టీ అరబ్‌పార్టీలున్న కూటమికి నేతృత్వం వహించటం యూదులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో మెజారిటీ యూదులు అతి మితవాద పక్షమైన లికుడ్ పార్టీకి, ఛాందసవాద జియోనిస్టు పార్టీకి వలస పోయారు. విభేదాలున్నా కలిసి పనిచేద్దామని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు మెరుగైన పరి ష్కారం చూపుదామని జతకట్టిన ఎనిమిది పక్షాల కూటమి ప్రభుత్వం నడపటంలో, ఆర్థిక సమస్య లను అరికట్టడంలో వైఫల్యాలే చవిచూసింది. అంతర్గత పోరుతో సతమతమైంది.
ఇప్పుడు గద్దెనెక్కబోతున్న కూటమిలోని జియోనిస్టు పార్టీ ప్రతిపాదనలు సామాన్యమైనవి కాదు. న్యాయవ్యవస్థను సమూల ప్రక్షాళన చేయాలన్నది దాని ప్రధాన డిమాండ్. పార్లమెంటు చేస్తున్న చట్టాలను సుప్రీంకోర్టు ఇష్టానుసారం కొట్టివేస్తున్నదనీ, ఇది దేశ భద్రతకు చేటు తెస్తున్నదనీ ఆ పార్టీ చాన్నాళ్లుగా ఆరోపిస్తోంది. దీన్ని నిజంగా అమలు చేయటం మొదలుపెడితే న్యాయవ్యవస్థ బలహీనపడుతుందనీ, న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ పక్షాలదే పైచేయి అవుతుందనీ చాలామంది కలవరపడుతున్నారు.
ఇప్పటికే మూడు అవినీతి ఆరోపణల్లో విచారణను ఎదుర్కో బోతున్న నెతన్యాహూకు ఇది తోడ్పడుతుందని వారి భావన. అన్ని స్థాయుల్లోనూ ఎక్కడికక్కడ వ్యవస్థాగతమైన నిఘా ఉన్నప్పుడే, దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పుడే వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుంది. తిరుగులేని అధికారం చలాయించే నేతకు అది సాగిలపడితే సర్వం అస్తవ్యస్థ మవుతుంది.
పరోక్షంగా తనకు లాభదాయకమైన ప్రతిపాదన చేస్తున్నారన్న ఉబలాటంతో బెన్ గవీర్‌ను రాజకీయంగా అదుపు చేయటంలో నెతన్యాహూ విఫలమైతే... పాలస్తీనాపై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలంగా అండదండలందిస్తున్న అమెరికా సైతం వర్తమాన అంత ర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరకాటంలో పడుతుంది. దాన్నుంచి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు లభించవు. అంతిమంగా ఏ దేశ పౌరులైనా సామరస్యతనూ, ప్రశాంతతనూ, ఆర్థిక సుస్థిరతనూ కోరుకుంటారు. ఇవన్నీ సుసాధ్యం చేసినప్పుడే నెతన్యాహూకు యూదుల నిజమైన ఆదరణ దొరకుతుంది.
Comments
Please login to add a commentAdd a comment