వ్యాక్సిన్‌ల సందడి | Covid 19 Vaccine Season Begins Around The World | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ల సందడి

Published Thu, Dec 10 2020 12:37 AM | Last Updated on Thu, Dec 10 2020 12:37 AM

Covid 19 Vaccine Season Begins Around The World - Sakshi

మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం ఆగమిస్తున్న వేళ ప్రపంచమంతటా వ్యాక్సిన్‌ సీజన్‌ మొదలైంది. అందరికన్నా ముందు అనుమతులు పొందిన ఫైజర్‌ సంస్థ బ్రిటన్‌లో టీకాలివ్వడం కూడా మొదలుపెట్టింది. మరో వారం రోజుల్లో 91వ ఏట అడుగుపెట్టనున్న మహిళ మార్గరెట్‌ కీనన్‌ ప్రపంచంలో టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా నమోదయ్యారు. 80 ఏళ్లు పైబడినవారికీ, కరోనా సోకితే ముప్పు అధికంగా వుండే అవకాశం వున్నవారికి తొలి దశలో ప్రాధాన్యమిస్తామని బ్రిటన్‌ ప్రక టించింది. ఇప్పుడు టీకాలు తీసుకుంటున్నవారికి మూడు వారాల తర్వాత రెండో డోసు అందిస్తారు. తీసుకునేవారి వయసునుబట్టి కాస్త హెచ్చుతగ్గులున్నా, మొత్తంమీద దీని సామర్థ్యం రేటు 95 శాతమని సంస్థ చెబుతోంది.

మరోపక్క అమెరికా సైతం దాన్ని అనుమతించేందుకు రెడీ అవు తోంది. ఈ వారం ఆఖరులో అక్కడ కూడా టీకాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాన్ని మన దేశంలో అందించడానికి కూడా ఫైజర్‌ అనుమతి కోరుతోంది. ఇంకా ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్‌ తదితర ఫార్మస్థీలు రూపొందించిన వ్యాక్సిన్‌లు తుది దశ  పరీక్షల్లోవున్నాయి. భారత్‌ బయోటెక్, సీరమ్‌ సంస్థలు తమ టీకాలకు అత్యవసర అనుమతులివ్వాలని కేంద్ర ఔషధాల ప్రమాణ నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ)ను కోరాయి. అయితే మరింత డేటా అవసరమని సీడీఎస్‌సీఓ తెలిపింది. 

సాధారణంగా వ్యాక్సిన్‌లను అనుమతించడం అంత తేలిగ్గా జరగదు. వేర్వేరు దశల్లో జరిపిన పరీక్షల డేటాను నిపుణులు నిశితంగా పరిశీలించాకే అది సాధ్యం. ఇదిగాక వచ్చిన డేటాపై లాన్సెట్‌ వంటి అంతర్జాతీయ వైద్య శాస్త్ర పత్రికల్లో ప్రపంచవ్యాప్తంగావున్న సహచర నిపుణుల సమీక్షలు జరుగుతాయి. ఆ డేటాపై వారి అభిప్రాయాలు, సందేహాలు, అభ్యంతరాలు వెల్లడయ్యాక అవస రమైతే తదుపరి పరీక్షలు జరుపుతారు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఆ తర్వాతే టీకాలకు అనుమతిస్తుంది. అయితే ఫైజర్‌గానీ, మోడెర్నాగానీ లాన్సెట్‌కు తమ పరీక్షల డేటాను ఇంకా పంపలేదు. లాన్సెట్‌ ప్రచురించిన తొలి వ్యాక్సిన్‌ డేటా ఆస్ట్రాజెనెకా టీకాకు సంబంధించిందే. అది 70 శాతంమేర వ్యాధినుంచి రక్షించగలదని తేలింది.

వ్యాక్సిన్‌లు అత్యంత సురక్షితమైనవని, వాటివల్ల కలిగే దుష్ఫలితాలు తక్కువని తేలితే తప్ప ఔషధ నియంత్రణ సంస్థలు అనుమతులు మంజూరు చేయవు. ప్రయోగాత్మక పరీక్షలన్నీ నిపుణుల నిత్య పర్యవేక్షణలో జరుగుతాయి. పరీక్షల సమయంలో బయటపడని సమస్యలు కూడా క్షేత్ర స్థాయిలో టీకాలిచ్చినప్పుడు ఏర్పడవచ్చు. అందుకే ఏ వ్యాక్సిన్‌కైనా అనుమతులు రావడానికి కనీసం ఒకటి రెండేళ్లు పడుతుంది. అయితే కరోనా మోగిస్తున్న చావు బాజాను చూసి బెంబేలెత్తిన బ్రిటన్‌ మొన్న అక్టోబర్‌లోనే చట్టాన్ని సవరించి అత్యవసర అనుమతులిచ్చే అధికారాన్ని ఔషధ నియంత్రణ వ్యవస్థకు కట్టబెట్టింది. యూరప్‌లో మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిటన్‌లోనే కరోనా మృతులు అత్యధికం. అక్కడ 62,000కు పైగా జనం మరణించారు.

ఫైజర్‌ను అనుమతిస్తూనే అది తాత్కాలికమేనని బ్రిటన్‌ షరతు పెట్టింది. దాని ప్రకారం ప్రతి బ్యాచ్‌లో ఉత్పత్తయిన వ్యాక్సిన్‌కూ విడివిడిగా అనుమతులిస్తారు. ఏ దశలోనైనా అది రద్దు చేసే అవకాశం కూడా వుంటుంది. అందుకే ఫైజర్‌కు బ్రిటన్‌ ఇచ్చిన అనుమతి రాజకీయపరమైనదే తప్ప, శాస్త్రీయ ప్రాతిపదిక వున్నది కాదన్న విమర్శలు కూడా వున్నాయి. బ్రిటన్‌ నమూనాను అనుసరించవద్దంటూ యూరప్‌ దేశాల్లోని నిపుణులు అక్కడి ప్రభుత్వాలను హెచ్చ రిస్తున్నారు. కరోనా ఉధృతి అధికంగా వున్నప్పుడు మన దేశం, మరికొన్ని దేశాలు రెమ్‌డెసివిర్‌ వినియోగానికి అనుమతించాయి. అది అప్పటికే వినియోగంలో వున్న యాంటీ వైరల్‌ ఔషధం కనుకే ఆ నిర్ణయం తీసుకున్నారు.

కొత్తగా రూపొందిన ఔషధం విషయంలో అలా చేయడం అసాధ్యం. ఏ దేశమైనా పౌరుల ప్రాణాలను అత్యంత విలువైనవిగా భావిస్తుంది. వ్యాక్సిన్‌ తీసు కున్నవారు ఆరోగ్యపరంగా చిక్కుల్లో పడితే ఆ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన సంస్థ మాత్రమే కాదు... అనుమతించిన ఔషధ నియంత్రణ సంస్థ కూడా సమస్యలు ఎదుర్కొనక తప్పదు. బ్రిటన్‌ కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అనుమతులిచ్చింది. ఇప్పుడు అమెరికా సైతం ఆ తోవనే ఎంచుకుంది. 

మన దేశంలో ఇప్పటికైతే అత్యవసరంగా అనుమతించే విధానం లేదు. వ్యాక్సిన్‌వల్ల కలిగే లబ్ధి, తలెత్తగల సమస్య మధ్య వుండే నిష్పత్తి ఆధారంగా మాత్రమే ఇంతవరకూ అనుమతులిస్తున్నారు. భారత్‌ బయోటెక్, సీరమ్‌ల వ్యాక్సిన్‌ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్న అభిప్రాయమే ఔషధ నియంత్రణ డైరెక్టర్‌ జనరల్‌కు వున్నట్టుంది. కనుకనే ఆ రెండు వ్యాక్సిన్‌లూ ఇంకా పరిశీలన దశలోనే వున్నాయి. ఔషధాన్ని అనుమతించడానికి కనీసం రెండు వారాల వ్యవధి తీసుకోవడం, ఈలోగా నిశితంగా పరిశీలించడం మన దేశంలో అనుసరిస్తున్న విధానం. ఒక విధంగా ఇది మంచిదే. ఎందుకంటే అమెరికా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా తీవ్రత చాలా తగ్గింది. ఆ వైరస్‌ వ్యాప్తి మూడునెలల క్రితంతో పోల్చినా ఎంతో మందగించింది.

రెండో దశ ముంచుకురావొచ్చునన్న అభిప్రాయం వున్నా దాని ప్రభావం చెప్పుకోదగ్గ రీతిలో వుండకపోవచ్చని అంటున్నారు. వేరే దేశాల్లో ఇచ్చిన అనుమతుల్ని గీటురాయిగా తీసుకునే సంప్రదాయం మన దేశంలో లేదు. అయితే పరీక్షలకు సంబంధించిన డేటానూ, ఇతరచోట్ల వచ్చే ఫలితాలనూ కూడా నిపుణులు అనుమతుల ప్రక్రియలో పరిశీలిస్తారు. మొత్తానికి రాగలకాలంలో పంజా విసరడం కరోనావైరస్‌కు అంత సులభం కాదని ఇప్పుడు వ్యాక్సిన్‌ల కోలాహలం చూస్తుంటే అర్థమవుతుంది. అయితే వ్యాక్సిన్‌లు వంద శాతం సురక్షితమని అనుకోరాదన్నదే నిపుణుల హెచ్చరిక. కనుక ఏ రోగం విషయంలోనైనా ముందు జాగ్రత్తలు పాటించడమే అత్యుత్తమం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement