లాంఛనంగానైనా కరచాలనాల్లేవు. మర్యాదకైనా చిరునవ్వుల్లేవు. అసలు ఒకరివైపు ఒకరు చూసుకున్న క్షణాలే లేవు. శుక్రవారం దాదాపు 90 నిమిషాలపాటు సాగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి సంవాదం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లపై ఇప్పటికే ప్రజానీకంలో పాతుకుపోయిన అభిప్రాయాలను మరింత దృఢపరిచింది. బైడెన్ తన విజయాలను ఘనంగా చాటలేరు. ట్రంప్ కన్నార్పకుండా అబద్ధాలు వల్లించటం మానుకోలేరు. వృద్ధాప్య ఛాయలు తనలో మచ్చుకైనా లేవని చాటేందుకు 81 యేళ్ల బైడెన్ తాపత్రయపడితే... న్యాయస్థానం తనను అపరాధిగా నిర్ధారించినా ఆత్మవిశ్వాసం మచ్చుకైనా సడల్లేదన్న అభిప్రాయం కలిగించేందుకు 78 యేళ్ల ట్రంప్ తంటాలుపడ్డారు.
చిత్రమేమంటే – ఈ అంశాల్లో ఇద్దరికిద్దరూ విఫలమయ్యారు. బైడెన్‌కి ఇప్పటికే ఉన్న పాయింట్లు ఇంకా తగ్గగా... ట్రంప్ కాస్త మెరుగుపడిన మాట నిజమే అయినా అనుకున్నంతగా లేదు. 1960లో అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్ ఎఫ్ కెనెడీ, రిచర్డ్ నిక్సన్‌లతో ప్రారంభమైన ఈ సంవాదం ఇంత పేలవంగా సాగిన సందర్భాలు ఎప్పుడూ లేవన్నది విశ్లేషకుల మాట. వచ్చే సెప్టెంబర్ 10న జరగబోయే రెండో సంవాదం సమయానికైనా బైడెన్ మెరుగుపడతారో లేదోనన్న దిగులు డెమాక్రటిక్ పార్టీని నిలువెల్లా వణికిస్తుండగా, రిపబ్లికన్ పార్టీ మాత్రం కులాసాగా సేదతీరుతోంది.
బైడెన్ వంటి బలహీనుడు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఇక చింత ఎందుకన్నది దాని భావన కావొచ్చు. ట్రంప్‌ను మించిన గెలుపు గుర్రం లేదని ఆ పార్టీ ఎప్పుడో నిర్ణయానికొచ్చింది. అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో మన మాదిరిగా అరుపులూ, కేకలూ ఉండవు. ఎదురుగా జేజేలుకొట్టే అభిమానులూ ఉండరు. ఒకరి ప్రసంగాల్లోకి ఒకరు చొరబడే సంస్కృతి కూడా లేదు. ప్రత్యర్థి చెప్పింది పూర్తిగా విని దీటైన, సహేతుకమైన జవాబు చెప్పగలిగినవారికి మద్దతు పెరుగుతుంది. కానీ ఇద్దరికీ అది పట్టలేదు. అడిగిన ప్రశ్నల్ని దాటేసే ట్రంప్ తీరు బుల్‌డోజర్‌ని మరపిస్తే, బైడెన్‌కు మాట పెగలడమే కష్టమైనట్టు కనబడింది.
ట్రంప్ సంధించిన ప్రశ్నలకు జవాబివ్వటంతో మొదలుపెట్టినా... హఠాత్తుగా సంబంధంలేని మరో అంశంలోకి వెళ్లి బైడెన్ అయోమయంలో పడిన సందర్భాలు అనేకం. ట్రంప్‌లో గతానికి మించిన మూర్ఖత్వం మూర్తీభవించివున్నదని, ఆయన్ను ఎన్నుకుంటే దేశం ప్రమాదంలో పడుతుందని చెప్పటం బైడెన్ ఉద్దేశం. కానీ అది సమర్థవంతంగా చెప్పలేకపోయారు. 2020 నాటి సంవాదం స్థాయిలోనైనా మాట్లాడలేకపోయారు. తన హయాంలోని వైఫల్యాలను కప్పిపుచ్చటమేకాదు... బైడెన్ విజయాలను మరుగుపరచటంలో ట్రంప్ విజయం సాధించారు.
వేరే దేశాల ఎన్నికలు ఎవరికీ పెద్దగా పట్టవు. కానీ ప్రపంచాన్నే శాసించే అమెరికాలో జరిగే ప్రతిదాన్నీ జాగ్రత్తగా గమనిస్తారు. యూరప్ ఖండం మొదలుకొని ఉత్తర కొరియా వరకూ అందరూ ఆసక్తి కనబరుస్తారు. సహజంగానే ఉక్రెయిన్‌లో రష్యా... గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాలూ, నాటోతో సంబంధాలూ, ప్రపంచంలో అమెరికా పరువు ప్రతిష్ఠలూ చర్చకొచ్చాయి. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ, వలసలు, ద్రవ్యోల్బణం, అబార్షన్లు సైతం ప్రధాన భాగం ఆక్రమించాయి.
పుతిన్‌ను ప్రోత్సహించింది నువ్వంటే నువ్వని పరస్పరం ఆరోపణలు చేసుకోవటం ఆసక్తి కలిగించే అంశం. యూరప్ దేశాలు నాటో వ్యయంలో తమ వాటా చెల్లించకపోతే సంస్థనే మూసేస్తానని ట్రంప్ బెదిరించటం పరోక్షంగా పుతిన్‌ను సమర్థించినట్టేనని బైడెన్ వాదించగా... అసలు ఉక్రెయిన్‌పై దాడికి పురిగొల్పిందే బైడెన్ అని ట్రంప్ ఎదురు దాడి చేయటం గమనించదగ్గది. అఫ్గాన్ నుంచి వైదొలగే క్రమంలో జరిగిన భంగపాటే పుతిన్‌కు ధైర్యాన్నిచ్చిందని ఆయన దబాయించారు. ఉక్రెయిన్‌కు నిధుల వరద పారిస్తూపోతే ప్రజలను మరింత కుంగదీస్తుందన్నది ట్రంప్ వాదన.
అయితే ఇజ్రాయెల్ విషయంలో ఇద్దరిదీ ఒకే మాట! కాకపోతే ఆ దేశానికి అన్నివిధాలా మద్దతిస్తున్నామని బైడెన్ అంటే... అదింకా సరిపోదన్నది ట్రంప్ ప్రత్యుత్తరం. యూదు వోటర్లు గణనీయంగా ఉండటంవల్లే ఇలా ఒకరిని మించి ఒకరు ప్రేమ ఒలకబోశారు. పైగా బైడెన్ పాలస్తీనీయుడిగా మారారని ట్రంప్ ఆరోపించారు. బైడెన్ మెతకదనం ఆసరా చేసుకుని వేరే దేశాల ప్రభుత్వాలు జైళ్లు, పిచ్చాసుపత్రులు ఖాళీ చేయించి అందరినీ అమెరికా పంపుతున్నారనడంలోని అంతరార్థం శ్వేత జాతి వోటర్లను ప్రసన్నం చేసుకునేందుకే!
దేశంలో ద్రవ్యోల్బణం క్రమేపీ తగ్గుతున్నా అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలను ఇంకా వేధిస్తూనే వుంది. అయితే మాంద్యం బెడద తొలగింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ధరలూ తగ్గాయి. కానీ వీటిని బైడెన్ గట్టిగా చెప్పలేకపోగా, కార్మికవర్గం సమస్యల్లో ఉందన్న ట్రంప్ వాదనతో ఏకీభవించారు. ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన వైనాన్ని అందరికీ గుర్తు చేయటంలో బైడెన్ విజయం సాధించారు. అబార్షన్‌కు వాడే మాత్రకు తాను వ్యతిరేకం కాదని ట్రంప్ చెప్పక తప్పలేదు. ఇది మహిళల ఘనవిజయం.
ప్రత్యర్థితో గంటన్నరపాటు వాగ్యుద్ధానికి తలపడినప్పుడు ఏదో ఒక సమయంలో ఓటమి ఎదురయ్యే పరిస్థితి రావొచ్చు. కానీ తొలి పది నిమిషాలూ నిబ్బరంగా లేనివారు ఓటమి నుంచి తప్పించుకోలేరంటారు. సంవాదంలో బైడెన్‌కు అదే జరిగింది. ఆయన ప్రసంగం తడబాట్లతో మొదలైంది. చాలాసార్లు సణుగుడుగా మిగిలిపోయింది. ట్రంప్ అడుగుతున్నప్పుడు నోరు తెరుచుకుని ఉండటం కూడా వీక్షకులను నిర్ఘాంతపరిచింది. మొత్తానికి తొలి రౌండ్‌లో ట్రంప్‌దే పైచేయి.
Comments
Please login to add a commentAdd a comment