పలుకుబడి | Editorial About Political Satire | Sakshi
Sakshi News home page

పలుకుబడి

Published Mon, Jan 17 2022 12:09 AM | Last Updated on Mon, Jan 17 2022 12:50 AM

Editorial About Political Satire - Sakshi

ఒక కాకి ఏ పనిమీదో అప్పుడే తాటిచెట్టు మీద వాలుతోంది. పని ఉండో లేకో ఒకాయన అదే తాటిచెట్టు దగ్గరికి అప్పుడే వస్తున్నాడు. ఆ కాకి కాలు తగిలి తాటిపండు సరిగ్గా ఆయన తలమీద రాలి పడిందట. కాకి కాలు తగిలితే తాటిపండు ఊడి పడుతుందా? ఇది మనకు పట్టింపు ఉన్న విషయం కాదు. కాకతాళీయం అనే మాటకు అర్థం ఆ కాకి, ఆ తాటిపండుతో ముడిపడిన వృత్తాంతమే మనకు కావాల్సినది. కొంత నాటకీయంగా ధ్వనించే ఈ కాకతాళీయం అనే మాటను ఎన్నోసార్లు వినివుంటారు. ఈ మాట చదువుతున్నప్పుడో, విన్నప్పుడో ఎప్పుడైనా తాటిపండు తల మీద రాలిపడుతున్న దృశ్యం మనసులో మెదిలిందా?

దీనికంటే నాటకీయమైనవి ఈ చండ్రనిప్పులు. రాజకీయ విమర్శల్లో ఫలానా ఆయన చండ్రనిప్పులు చెరిగాడంటారు. నిప్పులు చెరగడంలోనే ఒక కవిత్వం ఉంది సరే, కానీ ఈ చండ్ర అనేది ఏమిటి? ఇది ఒక చెట్టు. అది కాలుతున్నప్పుడు రేగే శబ్దం జోరుగా చిటపటమంటూ ఉంటుంది. కానీ ఈ మాట విన్నప్పుడు ఎప్పుడైనా ఆ ఉగ్రరూపంతో ఉన్న చెట్టు కళ్లముందు కదలాడిందా? దాదాపుగా ఇలాంటి మాటే, అట్టుడకటం. ఇందులో పెద్ద గోప్యమైన అర్థం ఏమీలేదు. మామూలు అట్టు ఉడకటమే. కానీ అట్టు పెనం మీద ఉడుకుతున్న, పొంగుతున్న ఇమేజ్‌ ఈ మాటతో జోడీ కట్టిందా అన్నదే అనుమానం. లేకపోతే అంత ఉడికీ ఏం ప్రయోజనం!

ఎటూ పెనం, పొయ్యి దగ్గరే ఉన్నాం కాబట్టి– ఈ ఆనవాలు సంగతేమిటో చూద్దాం. ఆనవాలు దొరక్కుండా చేయాలంటారు. ఆ పనిలో అది ఆయన ఆనవాలు అంటారు. అర్థం తెలుస్తోంది. కానీ ఇంతకీ ఏమిటివి? పాలల్లో ఒక్క నీటిబొట్టు కూడా లేకుండా చిక్కగా కాస్తే మిగిలేవి ఈ ఆనవాలుట! అదే వంటింట్లో ఉన్నప్పుడే కరతలామలకం ఏమిటో కూడా రుచి చూద్దాం. ఫలానా విషయం ఆయనకో, ఆవిడకో కరతలామలకం అంటారు. చేతిలో లేదా చేతి తలం మీద ఉన్న అమలకం. అనగా ఉసిరికాయ. అంటే అంత సులభంగా అందుకోగలిగేదీ, అందుబాటులో ఉన్నదీ అని. ఇంత సులభమైనది కూడా దాని అర్థంతో సహా బొమ్మ కడుతోందా అన్నది సందేహం.

ఇలాంటి వ్యవహారాలకు అర్థం చెప్పుకోవడం నల్లేరు మీద నడక ఏమీ కాదు. దీన్నే ఇంకోలా చెప్పుకొంటే, నల్లేరు మీద నడక చాలా సుఖం, హాయి. ఎందువల్ల? అసలు ఈ నల్లేరు ఏమిటి? ఇసుకలో నడిచినప్పుడు కాలు దిగబడిపోతుంది. కానీ అదే ఇసుకలో అక్కడక్కడా విస్తరించి ఈ నల్లేరు గుబురు గనక ఉందంటే దానిమీద అడుగులేస్తూ ఎంచక్కా నడిచిపోవచ్చు. పల్లేరు గాయలు గుర్తొచ్చాయంటే సరేగానీ ఈ నల్లేరు ఎంతమందికి తెలుసు? అన్నట్టూ గుచ్చాయంటే గుర్తొచ్చేది, ఏకు మేకవడం. ఏకు అనేది నేతపనిలో భాగం. మెత్తగా, సౌకుమార్యంగా, సాధువుగా ఉండేది కాస్తా మేకులాగా దుర్మార్గంగా తయారైన సందర్భంలో దీన్ని వాడతాం.

అన్నీ మనకు తెలుస్తాయా? ప్రయత్నిస్తాం, మళ్లీ ప్రయత్నిస్తాం, అయినా తెలియకపోతే వదిలేస్తాం. ఏదైనా పని జరగనప్పుడు కూడా అంతేగా. కాకపోతే వదిలేముందు ఒక మాట అనేసు కుంటాం, అందని మానిపండు అని. ఏమిటీ మానిపండు? దీని రుచి ఎలా ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడా దొరకదు. ఎందుకంటే, ఎక్కలేనంత పొడవైన, అందలేనంత పొడవైన మాను అంటే చెట్టుకు కాస్తుంది కాబట్టి. దీనికి దగ్గరగా వినిపించే మరో వ్యవహారం, అందలం. అక్కన్న మాదన్న అందలం ఎక్కితే, సాటి సరప్ప చెరువు గట్టెక్కాడట. ఏదో ఒకటి ఎక్కాలిగా ఆయన కూడా. ఇంతకీ మాదన్నతో కలిసి అక్కన్న ఎక్కిందేమిటి? పల్లకీ. మరి పల్లకీ ఎక్కడమంటే ఆ రోజుల్లో తమాషా! అదొక హోదాకు చిహ్నం. ఎవరో సమాజంలో అందె వేసిన చేతులకే అలాంటి యోగాలు దక్కేవి. ఇంతకీ ఏమిటీ అందె? కడియం. బిరుదుటందె అని కూడా అంటారు. ఒక మనిషి విద్వత్తు గలవాడనీ, ప్రవీణుడనీ, నిష్ణాతుడనీ చేతికి తొడిగే సర్టిఫికెట్‌ ఈ ఆభరణం. ఇలాంటివి కూపస్థమండూకాలకు దొరకడం కష్టం. అదేలే, కూపము అనగా బావి, ఆ బావిలో ఉండే, ఆ బావినే ప్రపంచంగా భావించుకునే కప్పలకు ఇలాంటి గౌరవాలు దక్కవూ అని చెప్పడం!

ఇకముందైనా ఇలాంటి మాటల్ని వాటి భావచిత్రాలతో గ్రహిద్దామని ఒడిగడదామా! అయ్యో, పాపానికి ఒడిగట్టినట్టుగా ధ్వనిస్తోందా? ఒడి అంటే ఒడి అనే. ఒడిగట్టడం అంటే ఒక పనికి పూను కోవడం అనే మంచి అర్థమే. కానీ కాలం చిత్రమైంది. ఎంత మంచి ఉద్దేశంతో మొదలైనవైనా కొన్ని మాటల్ని ఎందుకో ప్రతికూలంగా నిలబెడుతుంది. ఒక విధంగా దీని మంచి భావాన్ని తుంగలో తొక్కింది అనుకోవచ్చు. ఇంతకీ తుంగ అంటే మామూలు తుంగేగా? తుంగలో ఒక విషపూరిత తుంగ కూడా ఉంటుందట. ఆ తుంగలో గనక ఏదైనా ధాన్యాన్ని తొక్కితే ఇంక అది ఎప్పటికీ మొలకెత్తదట. అంటే ఒకదాన్ని సర్వనాశనం చేయడం తుంగలో తొక్కడం.

ఇవన్నీ రాస్తూపోతే ఎప్పటికి ఒక కొలికికి వచ్చేను? అదేలే, ఒక కొసకు, చివరకు, ముగింపు నకు. కానీ చాలా మాటలు, భావాలు, వ్యక్తీకరణలు తెలియకుండానే తుంగలో అడుగంటు తున్నాయి. భాష అనేది మన జీవనాడి. ఉత్త పలుకుగా అది బోలు గింజే. కానీ పూర్ణరూపంతో సారాన్ని గ్రహిస్తే అది అమృతాహారమే; పాతకాలం  పెళ్లిళ్లలో గాడిపొయ్యి మీద వండుకున్నంతటి విందుభోజనమే. ఓహో, మళ్లీ ఇదొకటి వివరించాలా! పశువులకు గడ్డి వేసే గాడి ఏమిటో, దానికీ గాడిపొయ్యికీ సంబంధం ఏమిటో... అసలు ఉందో లేదో తెలుసుకుంటేనే మన భాష ఒక గాడిన పడుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement