‘ఒరే మోహన్ గా! మన అమ్మలకి మనం పుట్టుండంరా! నిజంగా మనల్ని కనే ఉంటే మనల్ని రోజూ కళ్లెదురుగా సూసుకోకుండా ఉండగలుగుతారా! మనల్నిలాగా ఈ నరకంలో వదిలేసి ఎళ్లిపోగలుగుతారా?’... ఆరు నుంచి పది వరకు హాస్టల్‌లో ఉండే ప్రతి పిల్లాడు ఇలా ఎప్పుడో ఒకప్పుడు అనుకోకుండా ఉండడు. ఎదిగీ ఎదగని వయసులో హాస్టల్‌లో ఏదెలా ఉన్నా అక్కడ పూడ్చలేని వెలితి– తల్లితండ్రులు లేకపోవడం. అమ్మ గోరుముద్దలు, నాన్న ప్రేమపూర్వక గదమాయింపులు, శుభ్రమైన పక్కబట్టలు, రేడియో పాట, సయించే భోజనం, అన్నింటికి మించి భద్రమైన ఇంట్లో ఒళ్లెరుగకపోయే నిద్ర. ఇవేవీ హాస్టల్‌లో ఉండవు!
పిల్లలు చదువుకోవడానికే పుట్టి ఉండవచ్చు. చదువుకోవడానికి మాత్రమే పుట్టలేదు. కాని చదువుకుంటే తప్ప పుట్టగతులు ఉండవు. తొమ్మిది నెలల తర్వాతే పిల్లలందరూ భూమ్మీద పడ్డా ఆ భూమిని బట్టి వారి అదృష్టం ఆధారపడి ఉంటుంది. అగ్రహారం అయితే ఒకలాగా, రెడ్ల ఇలాకా అయితే ఒకలాగా, కామందుల వీధైతే ఒకటి, శెట్టిగారి బజారైతే ఒకటి. ఇవి గాకుండా వేరే వీధులు, వెలివాడలు ఉంటాయి. ఆ భూమ్మీద పుట్టిన పిల్లలు తిండికి, చదువుకు గతి లేకపోతే ఇదిగో ఇలా ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుకోవాలి. అమ్మను తిట్టుకోవాలి. ఆక్రోశించాలి.
హాస్టల్‌లో ఉన్న కన్నబిడ్డను ఆదివారం వచ్చి చూసుకునే వీలు తల్లికి ఉంటుంది. అదీ ఇదీ వండుకొని, బిడ్డ కడుపుకు ఇంత తినిపించుకుని, తల దువ్వి, పేన్లు చూసి, ఒళ్లో పరుండబెట్టుకుని కబుర్లు చెప్పి, వదల్లేక వదల్లేక ఆ తల్లి పోతూ ఉంటే అప్పటికే ఔట్‌బెల్లు టైమైపోయిందని తల్లి కళ్ల ముందే కన్నకొడుకును నాలుగు పీకుతాడు హాస్టల్ బాధ్యుడు. అప్పుడు తల్లేమైనా భద్రకాళి అవుతుందా? నా కొడుకును ఈ బందీఖానాలో ఉంచను అని తీసుకెళ్లి పోతుందా? ‘మీరు కొట్టి సంపేత్తాకి కనలేదు సారు మేము బిడ్డల్ని. మా గచ్చంతరం బాగోక ఇక్కడొదిలేసాం’ అంటా నడుసుకుంటా ఎలిపోతుంది.
‘ప్రపంచం మొత్తాన్ని తెచ్చి క్లాస్‌రూమ్‌లో కుదించలేము. క్లాస్‌రూమ్‌నే ప్రపంచంలోకి తీసు కెళ్లాలి’ అని 1912లో జర్మనీలో మొదటి హాస్టల్‌ను మొదలెట్టాడు రిచర్డ్ షిర్మన్ అనే స్కూల్ టీచరు. విహారాలకు వెళ్లే పిల్లలు తక్కువ ఖర్చులో బస చేయడానికి వీలుండటం లేదని తన స్కూల్‌లోనే తొలి హాస్టల్ కట్టాడు. అతని వల్ల ప్రపంచమంతా యూత్ హాస్టల్సు, దరిమిలా రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి. విషాదమేమంటే ఏ ఉద్దేశంతో రిచర్డ్ షిర్మన్ హాస్టల్స్ మొదలెట్టాడో దానికి పూర్తి విరుద్ధంగా ఏ విహారమూ లేని బందీఖానాలుగా అవి మారాయి.
‘అందరికన్నా ముందు పరిగెత్తి కంచం పట్టుకుని లైన్లో నిలబడ్డా. అన్నం డేక్షాలొచ్చేసున్నాయ్. పొప్పుది, సాంబారుది, మజ్జిగిది గిన్నిలొత్తే వడ్డన మొదలెట్టేత్తారు. అన్నం డేక్షా మీద మూత లేదేమో ఈగలన్నీ ఆల్నియ్. అన్నియ్యా ఈగలోల్తనాయ్ అని పిలిత్తే ఆ ఈగల్ని తోలకుండానే దాని మీద మూత పడేసాడు వర్కరు. పారిపోయే దారిలేక ఆ ఈగలందులోనే సచ్చి అన్నంలో కలిసి పోనియ్. కంచంలో ఏత్తే హస్తానికో ఈగ పడింది నా కంచంలో’....
పాత భవనాలు, పెచ్చులూడిపోయే సీలింగులు, ఊరికి దూరంగా మనిషి అలికిడి లేని బీడు పరిసరాలు, సరిపోని నీళ్లు, కడుపులో దేవే పాయిఖానాలు, అపరిశుభ్ర ఆహారం, దుప్పట్లు ఇవ్వని చలికాలం, తప్పని తీట.. తామర, చీటికి మాటికి ఘోరంగా చావగొట్టే సిబ్బంది, ముళ్లతీగల ఫెన్సింగ్.... ఇవీ కొన్ని చోట్ల సంక్షేమ హాస్టళ్లు.
తెలుగు సాహిత్యంలో హాస్టల్ లైఫ్ చెదురు మదురుగా కనిపిస్తుంది. నవీన్ ‘అంపశయ్య’, కేశవ రెడ్డి ‘సిటీ బ్యూటిఫుల్’, కొమ్మూరి వేణుగోపాలరావు ‘హౌస్ సర్జన్’, వడ్డెర చండీదాస్ ‘అనుక్షణికం’ హాస్టల్ జీవితాన్ని కొద్దో గొప్పో చూపుతాయి. అయితే అవన్నీ పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల జీవితాలు.
కాని రచయిత మోహన్ తలారి ‘హాస్టల్ లైఫ్’ కథలు ప్రీ మెట్రిక్ విద్యార్థుల భౌతిక మనోలోకాల్లో హాస్టల్ రేపగల కల్లోలాన్ని గట్టిగా పట్టి ఇస్తాయి. ఇరవై ఏళ్ల క్రితం తాడేపల్లిగూడెం సమీపంలోని ఆరుగొలను గురుకుల పాఠశాలలో తాను గడిపిన హాస్టల్ జీవితపు పచ్చి జ్ఞాపకాల ధార ఈ కథలు. కర్కశపు చారలు ఈ కథలు. ఇరవై ఏళ్ల తర్వాత, నేడు, ఇరు రాష్ట్రాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గురుకుల పాఠశాలల, హాస్టళ్ల అధికారులు ఈ పుస్తకాన్ని ఒక కొలతగా గనక తీసు కుంటే, అప్పటికీ ఇప్పటికీ ఏం మారిందో, ఎంత మారిందో చూసుకుంటే చేయవలసిన పని తెలు స్తుంది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే లక్షలాది నిరుపేద బాలల పెదాలపై చిర్నవ్వు మొలుస్తుంది.
నిజానికి ఇంటర్, కాలేజీ హాస్టళ్ల విద్యార్థులకు అంతో ఇంతో ఎరుక, ఎదురీదే సామర్థ్యం ఉంటాయి. కాని 15 లోపు పసివయసు విద్యార్థులు ఉండే, తల్లితండ్రులను వదలి ఉండే, పేదరికం కారణంగానో నిస్సహాయ పరిస్థితుల వల్లనో హాస్టళ్లల్లో ఉండి చదువుకోక తప్పని వర్గాల పిల్లలుండే హాస్టళ్లు ఎంతో ఆదరణీయంగా ఉండాలి. ఆత్మీయంగా ఉండాలి. అక్కున జేర్చుకునేలా ఉండాలి. అలా ఉన్నదా? నీ పిల్లలు ఉండే చోటు ఎలా ఉండాలనుకుంటావో... ఆ పిల్లలు ఉండే చోటు అలా ఉండాలనుకుంటున్నావా? ‘అంకుల్ టామ్స్ కేబిన్ ’ అనే ఒక్క పుస్తకం నల్ల బానిసల జీవితాల్లో సమూలంగా మార్పు తెచ్చింది. మన దేశంలో ఎన్ని పుస్తకాలు వస్తే సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే – దేవునితో తప్ప మరెవరితోనూ మొత్తుకునే వీలులేని– ట్రంకుపెట్టె పిల్లల జీవితాలు మారతాయి?
Comments
Please login to add a commentAdd a comment