సర్వేలన్నీ జోస్యం చెప్పినట్టు బుధవారం జరిగిన ఇండొనేసియా దేశాధ్యక్ష ఎన్నికల్లో రక్షణమంత్రి, వివాదాస్పద మాజీ సైనికాధికారి జనరల్ ప్రబోవో సుబియాంటో విజయం సాధించారు. అభ్యర్థుల్లో మిగిలినవారితో పోలిస్తే ఓటర్లకు బాగా పరిచయమున్న నేత గనుక తొలి రౌండులో ముందంజలో ఉంటాడని అందరూ అంచనా వేశారు. కానీ నెగ్గటానికి అవసరమైన 50.1 శాతం కనీస ఓట్ల వరకూ వెళ్లగలరని ఎవరూ అనుకోలేదు. ఇండొనేసియా ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థుల్లో ఎవరికీ కనీస ఓట్లు లభించకపోతే తిరిగి పోలింగ్ నిర్వహించకతప్పదు. గతంలో అధ్యక్ష పదవికి రెండు దఫాలు పోటీచేసి ఓడిన సుబియాంటోకు తాజా ఎన్నికల్లో సానుభూతితోపాటు యువత మద్దతు పుష్కలంగా దొరికింది. అందుకే ఆయనకు 60 శాతం ఓట్లు పోలయ్యాయి. సుబియాంటో చరిత్ర ఏమంత ఘనమైనది కాదు.
దేశాన్ని దీర్ఘకాలం పాలించిన తన సొంత మామ, నియంత జనరల్ సుహార్తో ప్రాపకంతో సైన్యంలో ఉన్నత పదవులకు ఎగబాకి లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగారు. 1997 నాటి విద్యార్థి ఉద్యమాన్ని దారుణంగా అణిచేయటంలో కీలకపాత్ర పోషించారు. ఆ సమ యంలో దాదాపు 20 మంది విద్యార్థి నేతల అపహరణలకు సుబియాంటోయే కారణమన్న ఆరోపణ లున్నాయి. వారందరూ సైన్యం చిత్రహింసలకు బలైవుంటారని మానవ హక్కుల సంఘాలు ఆరో పించాయి. చిత్రమేమంటే ఆ తర్వాత మరో ఏడాదికే సుహార్తోను గద్దెదించటానికి సుబియాంటో తోడ్పడ్డారు. ఆ తర్వాత తానే ఆ పీఠాన్ని అధిష్టించాలని ఉవ్విళ్లూరినా అది సాధ్యపడలేదు.
కనీసం సైనిక దళాల చీఫ్ కావాలని కలలుకన్నా సుహార్తో స్థానంలో అధ్యక్షుడైన బీజే హబీబి అందుకు ససేమిరా అంగీకరించలేదు. దాంతో ఆయనపై ఆగ్రహించి కొందరు సైనికులను వెంటబెట్టుకుని అధ్యక్ష భవనంపై దాడికి సిద్ధపడ్డారు. కానీ అది వికటించి సైన్యం నుంచి ఉద్వాసన తప్పలేదు. ఆ తర్వాత జోర్డాన్ పరారై వ్యాపారవేత్తగా అవతరించారు. 2009 అధ్యక్ష ఎన్నికల నాటికి సొంతంగా ఒక పార్టీ స్థాపించి మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణోపుత్రితో కూటమికట్టి ఉపాధ్యక్షుడిగా పోటీచేశారు. కానీ ఆ కూటమి ఓటమి చవిచూసింది.
2014, 2019 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసినా ఓటర్లు తిరస్కరించారు. ఆ తర్వాతే సుబియాంటోకు జ్ఞానోదయమైంది. రెండుసార్లూ తనపై గెలిచిన అధ్యక్షుడు జోకోవితో సంధి చేసుకుని రక్షణమంత్రి అయ్యారు. ఈసారి సైతం జోకోవియే పోటీచేసేవారు. కానీ అధ్యక్ష పదవికి వరసగా రెండుసార్లు మించి పోటీ చేయకూడదన్న నిబంధన కారణంగా ఆయన రంగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ప్రపంచంలోనే ఇండొనేసియా మూడో అతి పెద్ద ప్రజాతంత్ర దేశం. జనాభా రీత్యా ముస్లింలు అత్యధికంగా వున్న దేశం. ఆగ్నేయాసియాలో అతి పెద్ద పారిశ్రామిక దేశంగా ఒకప్పుడున్నా 1997లో వచ్చిన ఆర్థిక సంక్షోభంలో దెబ్బతింది. ఆ తర్వాత క్రమేపీ వృద్ధి సాధిస్తూ 2012 నాటికి జీ–20 దేశాల్లో ఆర్థికాభివృద్ధి వైపు దూసుకుపోతున్న నాలుగో అతి పెద్ద దేశంగా ఎదిగింది. 2020లో కోవిడ్ బారిన పడటమేకాక, ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటున్నా నిరు ద్యోగం, అధిక ధరలు వేధిస్తూనే వున్నాయి. దానికితోడు దక్షిణ చైనా సముద్రంలో చైనాతో సరిహద్దు తగాదాలున్నాయి. అయితే ఇరు దేశాల ఆర్థిక సంబంధాలకూ ఆ వివాదం అడ్డురాలేదు.
అటు అమె రికా, భారత్‌లతో సాన్నిహిత్యం సాగిస్తూ ఇండొనేసియా ఆర్థికంగా పుంజుకుంటోంది. విదేశీ పెట్టు బడులను ఆకర్షిస్తోంది. అయితే దీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ, ఉద్యమ చరిత్రగల ఇద్దరు నేతలను కాదని మాట నిలకడ, సిద్ధాంత నిబద్ధత లేని సుబియాంటోకు ఈ స్థాయిలో ప్రజలు నీరాజనాలు పట్టడం ఆశ్చర్యకరమే. యువతలో సుబియాంటో పేరు మారుమోగటానికి టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాలు దోహదపడ్డాయి. సర్వే నిర్వహించిన సంస్థలకు ఓటర్లు... మరీ ముఖ్యంగా యువ ఓటర్లు ఆయన గత చరిత్ర తమకు అనవసరమని చెప్పటం సుబియాంటోకున్న జనాకర్షణను తెలియజేస్తుంది.
గతంలో దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన రెండుసార్లూ తన సైనిక గతాన్ని ఘనంగా చెప్పుకున్న సుబియాంటో ఈసారి ఆ జోలికి పోలేదు. సైనికాధికారిగా పనిచేసిన కాలంలో తూర్పు తైమూర్‌లో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నవారిని హతమార్చటం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఉద్యమించిన విద్యార్థి నేతలను మాయం చేసి వారి ప్రాణాలు తీయటంవంటి అంశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఆయనపై నిషేధం కూడా విధించాయి.
మూడో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండొనేసియాలో క్రమేపీ వ్యవస్థలు బలహీనపడు తుండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈసారి సుబియాంటో తరఫున ఉపాధ్యక్ష పదవికి నిలబడిన 36 ఏళ్ల గిబ్రాన్ నేపథ్యమే ఈ సంగతి చెబుతుంది. కనీసం 40 ఏళ్లుంటే తప్ప ఉపాధ్యక్ష పదవికి పోటీచేయటానికి వీల్లేదని ఎన్నికల నిబంధనలు చెబుతున్నా రాజ్యాంగ న్యాయ స్థానం చీఫ్ జస్టిస్‌గా వున్న గిబ్రాన్ మామ ఈ నిబంధనను సవరించి అతనికి సాయపడ్డాడు. దీనిపై ఆందోళన చెలరేగి చీఫ్ జస్టిస్ రాజీనామా చేయాల్సివచ్చినా, ఆ తీర్పు మాత్రం రద్దుకాలేదు.
20 కోట్ల మంది ఓటర్లలో అత్యధికుల మనసు గెలుచుకున్న సుబియాంటో అంతంతమాత్రంగా వున్న వ్యవస్థలను మరింత బలహీనపరుస్తారని ఆయన ఎన్నికల ప్రసంగాలే చెబుతున్నాయి. మానవ హక్కుల చార్టర్, రాజ్యాంగ న్యాయస్థానం వంటివి కనుమరుగైతే ఇండొనేసియా తిరిగి నియంతృత్వంలోకి జారుకుంటుంది. ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుంది. ప్రజల అప్రమత్తతే ఆ ప్రమాదాన్ని నివారించాలి.
Comments
Please login to add a commentAdd a comment