అంతర్జాతీయ వాతావరణం ఎలావుందో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, మారిన పరిస్థితులకు తగినట్టు విధానాలు సవరించుకోనట్టయితే వెనకబడిపోవటం ఖాయం. ఈ సంగతిని మన దేశం ఆల స్యంగానైనా గ్రహించి అఫ్ఘానిస్తాన్ శాంతి చర్చల్లో పాలుపంచుకుంది. ఖతార్‌లోని దోహాలో అఫ్ఘాన్ ప్రభుత్వానికి, తాలిబన్‌లకు మధ్య ఆదివారం నుంచి జరుగుతున్న చర్చల్లో మన దేశంతో పాటు 15 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గత ఫిబ్రవరిలో అమెరికా–తాలిబన్‌ల మధ్య ఒప్పందం కుదర డానికి రెండేళ్లముందు నుంచే వారిద్దరి మధ్యా చర్చలు జరుగుతున్నాయి. అప్పటినుంచీ ఇందులో పాలుపంచుకోమని అమెరికా మన దేశాన్ని కోరుతోంది. 2001లో తమ గడ్డపై ఉగ్రదాడి తర్వాత భూగోళంలో ఏ మూలనున్నా ఉగ్రవాదాన్ని అంతం చేస్తానని అమెరికా ప్రకటించి అఫ్ఘానిస్తాన్‌లోకి అడుగుపెట్టింది. వరస దాడులతో తాలిబన్‌లు నష్టాన్ని చవిచూసిన మాట వాస్తవమే.
బిన్‌లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టింది. ముల్లా ఒమర్‌ను కూడా హతమార్చింది. కానీ ఆ క్రమంలో అమెరికా కూడా భారీగా నష్టపోయింది. వేలాదిమంది సైనికులు బలయ్యారు. మరిన్ని వేలమంది గాయపడ్డారు. వేలాది కోట్ల డాలర్లు వెచ్చించినా ఈ యుద్ధం అంతమయ్యే జాడలు కనబడలేదు. ఈ పరిస్థితుల్లోనే 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ తాను గెలిస్తే అమెరికా సేనల్ని వెనక్కి తీసుకొ స్తానని వాగ్దానం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాలిబన్‌లతో ఒప్పందం కుదుర్చుకుని ఆ దిశగా ఆయన అడుగులేశారు. తాలిబన్‌లు ఇప్పుడు పూర్తిగా మారిపోయారని, అందువల్ల వారితో సర్దుకుపోవాలని మన దేశానికి అప్పటినుంచీ ఆయన చెబుతున్నారు. కానీ గతంలో వారితో వున్న చేదు అనుభవాలరీత్యా మన దేశం అందుకు సిద్ధపడలేదు. తాలిబన్‌లు పాకిస్తాన్ ప్రాపకంలో పని చేస్తారన్నది బహిరంగ రహస్యం. 90వ దశకంలో వారు అఫ్ఘాన్‌ను చెరబట్టినప్పుడు కశ్మీర్‌లో వారు సాగించిన హత్యాకాండ, సృష్టించిన విధ్వంసం ఎవరూ మరిచిపోరు. తాలిబన్‌లు 1999లో మన ఎయిరిండియా విమానం హైజాక్ చేసి ఇక్కడి జైళ్లలో వున్న తమ సహచరులు ముగ్గుర్ని విడిపించు కున్నారు. ఇదంతా చరిత్ర. కానీ ఇప్పుడు అమెరికా ఏదో విధంగా ఆ దేశం నుంచి బయటపడటం కోసం, అది సాధ్యమైనంత గౌరవప్రదంగా వుండటం కోసం తాపత్రయపడి తాలిబన్‌లతో ఒప్పందం చేసుకుంది. వారితో చర్చించేది లేదని భీష్మించుకుని కూర్చున్న అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని సైతం ఒప్పించింది. ఆయన వద్దంటున్నా జైళ్లలో వున్న తాలిబన్ శ్రేణు లను విడిపించింది. ఆ ఒప్పందం తర్వాత కూడా గత ఆరునెలల్లో తాలిబన్‌లు స్త్రీలు, పిల్లలతోసహా 1,300మంది పౌరుల ప్రాణాలు తీశారని, అఫ్ఘాన్ జవాన్లు 3,560మంది వారి దాడుల్లో మరణించారని ఘనీ లెక్కలు చెప్పినా లాభం లేకపోయింది.
ప్రస్తుత దోహా చర్చల్లో ఘనీ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటున్నారు. మొదట్లో ఈ చర్చలను గట్టిగా వ్యతిరేకించి, అందులో పాలుపంచుకోవడానికి నిరాకరించిన మన దేశం సహజంగానే ఇప్పుడు ‘బయటి దేశం’గా మిగిలింది. అయితే ఆలస్యంగానైనా ఇది మంచి నిర్ణయం. అఫ్ఘాన్ పునర్నిర్మాణంలో మన దేశం చురుగ్గా పాలుపంచుకుంది. పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టింది. ఔషధాలు, నిత్యావసరాలు అందించంలో మొదటినుంచీ ముందుంది. కానీ ఘనీ ప్రభుత్వం అవసరమైనంతగా బలపడలేదు. దేశంలోని కొన్ని నగరాలకూ, పట్టణాలకూ ప్రభుత్వం పరిమితంకాగా... విశాల గ్రామీణ ప్రాంతాలు మొదటినుంచీ పూర్తిగా తాలిబన్‌ల నియం త్రణలో వున్నాయి. పాకిస్తాన్ జైల్లో పదేళ్లుగా బందీగావున్న తాలిబన్ సహ సంస్థాపకుడు ముల్లా అబ్దల్ ఘనీ బరాదర్‌ను పాక్ పాలకులు ఒప్పించి, అమెరికాతో రాజీ కుదుర్చుకోవడానికి సిద్ధపడే షరతుపై 2018లో విడిచిపెట్టారు. అప్పటినుంచీ తాలిబన్‌లపై పాక్ పట్టు పెరిగింది. ఆ కారణంతోనే మన దేశం ఈ శాంతి చర్చలకు దూరంగా వుంది. కానీ అక్కడ తాలిబన్‌లు ప్రధాన పాత్రవహించే ప్రభుత్వానికి దూరంగా వుండటం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం వుండదన్న అవగాహనతో చివరకు మన దేశం ఈ సమావేశంలో పాల్గొంది. అలా పాల్గొన్నప్పుడే భవిష్య అఫ్ఘాన్ ఎలావుండాలన్న అంశంలో మన వాదన వినిపించడానికి, తగినంతగా ప్రభావితం చేయడానికి అవకాశం వుంటుం దన్న నిపుణుల సూచన కొట్టిపారేయదగ్గది కాదు.
అయితే తాలిబన్‌ల తాజా ప్రకటనల తీరు చూస్తే వారిలో మార్పు వచ్చిందంటున్న మాటలు ఎంతవరకూ సరైనవన్న సందేహాలు తలెత్తుతాయి. కాల్పుల విరమణ ప్రకటించాలన్న అఫ్ఘాన్, అమెరికాల వాదనను వారు ఒప్పుకోవడం లేదు. రెండు దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధానికి మూల కారణమేమిటో చర్చించకుండా కాల్పుల విరమణ అంటే ఎలా అని తాలిబన్ ప్రతినిధులు ప్రశ్నిస్తు న్నారు. గత అయిదారురోజులుగా సాగుతున్న చర్చంతా ప్రధాన చర్చలకు ప్రాతిపదిక ఏర్పర్చడం కోసమే. కాల్పుల విరమణపై ఈ ప్రాథమిక చర్చల్లోనే ప్రతిష్టంభన ఏర్పడటం అనేక సందేహాలు కలిగిస్తోంది. అఫ్ఘాన్‌లో వున్న వివిధ మిలిటెంటు సంస్థల్లో తాలిబ¯Œ ప్రధానమైనది. ఇతరులతో పోలిస్తే తాలిబన్‌ల బలం అధికమే అయినా అది కూడా అంతర్గత పోరుతో కొట్టుమిట్టాడుతోంది. మనకు ఇష్టమున్నా లేకపోయినా అది పాకిస్తాన్ ప్రాపకంతోనే అడుగులేస్తుంది. ఉన్నకొద్దీ అఫ్ఘాన్‌లో తన పలుకుబడి మరింత పెంచుకుంటుంది. మహిళల హక్కులపై, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుపై తాలిబన్‌లు ఇంతవరకూ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఉదారవాదులుగా ముద్రపడ్డ షేర్ మహమ్మద్ అబ్బాస్, ముల్లా బరాదర్‌లను చివరి నిమిషంలో తప్పించి ఛాందసవాది మలావీ హక్కానీని చర్చలకు పంపడంలోనే ఇలాంటి అంశాల్లో తాలిబన్‌ల వైఖరేమిటో చెబుతోంది. తమ గడ్డను ఉగ్రవాదుల అడ్డాగా మారనీయబోమని తాలిబన్‌లు అంటున్నారు. ఉన్నంతలో ఇదొక్కటే మనకు అనుకూలమైన అంశం. కనీసం తాలిబన్‌లను దీనికైనా కట్టుబడి వుండేలా చేయగలిగితే, వారిని తటస్తులుగా ఉంచగలిగితే ఉన్నంతలో అది మేలే.
Comments
Please login to add a commentAdd a comment