హడావుడి లేదు. ఆర్భాటం అసలే లేదు. చడీచప్పుడూ లేకుండా దేశంలో నాలుగురోజుల వ్యవధిలో భారీ సంస్కరణలు పట్టాలెక్కాయి. మొన్నటికి మొన్న సాగు రంగ సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులకు మూజువాణి ఓటుతో పార్లమెంటు ఆమోదముద్ర పడింది. కార్మిక చట్టాలను సంస్కరించే మరో మూడు బిల్లులు సైతం పార్లమెంటులో బుధవారం మూడు గంటల చర్చ తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఈ మూడు బిల్లులూ మూడు కోడ్‌లుగా వున్నాయి– కార్మికుల వృత్తిపరమైన భద్రత, వారి ఆరోగ్యం, పని పరిస్థితులపైనా... పారిశ్రామిక సంబంధాల పైనా... కార్మికుల సామాజిక భద్రతపైనా వీటిని రూపొందించారు. మిగిలినవాటి మాటెలావున్నా మొదటి రెండు బిల్లులపైనా కార్మిక సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. ఇవి రాష్ట్రాల పరిధిలోకి జొరబడి, వాటి హక్కుల్ని దెబ్బతీస్తున్నాయని కేరళవంటి రాష్ట్రాలు ఆరోపిస్తుంటే... ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) సైతం పారిశ్రామిక సంబంధాల కోడ్ కార్మికులకు వ్యతిరేకంగా వున్నదని ఆరోపిస్తోంది. నిరుడు మే నెలలో రెండోసారి ఘన విజయం సాధించాక జరిగిన సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సంపద సృష్టి, సంపద పునఃపంపిణీలను ప్రస్తావించారు. ఆ రెండింటినీ ప్రస్తావించారంటేనే తన రెండో దశ పాలనలో అందుకు తగ్గ సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చాలామంది జోస్యం చెప్పారు. ఇప్పుడదే జరుగుతోంది. సాధారణంగా అయితే అమల్లో వున్న విధానాలను సమూలంగా మార్చే ఈ మాదిరి సంస్కర ణలు తీసుకురావడం అంత సులభం కాదు.
పార్లమెంటులో వాగ్యుద్ధాలు, సభల వాయిదాలు, సమ్మె పిలుపులు, ఆందోళనలు రివాజు. కానీ కరోనా అనంతర పరిస్థితులు దాన్నంతటినీ మార్చేశాయి. అనేకానేక పరిమితుల మధ్య పార్లమెంటు సమావేశంకాగా... ఉద్యోగ భయం, జీతాల కోత వగైరాలతో భవిష్యత్తుపై బెంగతో కార్మికులు, బడుగు ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వాల ఆంక్షలతో పాటు, కరోనా అంటేవున్న భయాందోళనల వల్ల సమీకరణ కూడా అసాధ్యం. వీటి అవసరం లేకుం డానే ఇంత ముఖ్యమైన సంస్కరణలపై లోతైన చర్చలు జరిగితే అవి మనం అనుసరిస్తూ వస్తున్న ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రతిబింబించేవి. సాగు రంగ సంస్కరణల బిల్లుల విషయంలో సభలో విపక్షాలు వున్నా చర్చలు సరిగా సాగలేదు. ఇప్పుడు కార్మిక రంగ సంస్కరణల బిల్లులకైతే దాదాపుగా విపక్షాలే సభలో లేవు.
కార్మిక చట్టాల ప్రధానోద్దేశం కార్మికుల హక్కుల్ని పరిరక్షించడం, అదే సమయంలో యాజ మాన్యాల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడటం. ఇప్పుడు అమల్లోవున్న చట్టాలు కార్మిక హక్కుల పరిరక్షణపై అతిగా శ్రద్ధ చూపుతున్నాయని పరిశ్రమల యజమానులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఇవి కార్మికులకు ఉపయోగపడటం మాటెలావున్నా అధికారుల అవినీతికి దారితీస్తున్నాయి. చూసీ చూడనట్టు పోవడం కోసం భారీగా సొమ్ము చేతులు మారుతోంది. చాలా పరిశ్రమల్లో రిజిస్టర్‌లో వుండే కార్మికులకూ, వాస్తవంగా పనిచేసే కార్మికుల సంఖ్యకూ పొంతన వుండదు. అందువల్ల అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు మరణించినా, శాశ్వతంగా వికలాంగులైనా వారిపై ఆధారపడే వారికి ఏ అండా లేకుండా పోతోంది. కనుక పారదర్శకమైన, అందరికీ ప్రయోజనకరమైన చట్టాలు వుంటే మంచిదే. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలకు అందుకు దోహదపడతాయా? మన దేశంలో వాస్తవంగా కార్మిక చట్టాలెలా వున్నాయో చెప్పడానికి దేశం నలుమూలలా లాక్‌డౌన్ సమ యంలో స్వస్థలాలకు నిత్యం నడుచుకుంటూ పోయిన వేలాదిమంది వలసజీవులే సాక్ష్యం. సంవత్స రాల తరబడి వారు చేసే చిన్నా చితకా ఉద్యోగాలు, పనులు ఏ చట్టం కిందికీ రాకపోవడం వల్ల హఠా త్తుగా వారు రోడ్డున పడ్డారు. సాయం చేయడం మాట అటుంచి, అత్యధికశాతం యజమానులు వారికి ఇవ్వాల్సిన బకాయిల్ని కూడా ఎగ్గొట్టి వెళ్లగొట్టారు. కార్మిక చట్టాలు పటిష్టంగావుంటే అది అసాధ్యమ య్యేది. చిత్రమేమంటే లాక్‌డౌన్ సమయంలో యూపీ, ఎంపీ రాష్ట్రాలు కార్మికుల పనిగంటలు పెంచుతూ ఆర్డినెన్సులు తీసుకొచ్చాయి. పెద్దయెత్తున నిరసనలు రావడంతో అవి నిలిచిపోయాయి.
ఇప్పుడు ఆమోదం పొందిన మూడు బిల్లులూ 350 పేజీల్లో, 411 క్లాజులతో, 13 షెడ్యూళ్లతో వున్నాయి. ఇంత విస్తృతమైన బిల్లులపై మూడు గంటల వ్యవధిలో చర్చ పూర్తయిందంటే వింతగానే వుంటుంది. నియామకాల్లో, తొలగింపులో ఎక్కువ నిబంధనలు యాజమాన్యాలకే అనుకూలంగా వున్నాయని... వివాద పరిష్కార విధానాలు సైతం కార్మిక ప్రయోజనాలను దెబ్బతీసేలా వున్నాయని బీఎంఎస్ ఆరోపిస్తోంది. పైగా తాము, ఇతర కార్మిక సంఘాలు లోగడ వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని, పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సుల్ని కూడా సరిగా పట్టించు కోలేదని చెబుతోంది. ఇంతక్రితం వందలోపు కార్మికులున్న పరిశ్రమల్లో ప్రభుత్వాల ముందస్తు అను మతి లేకుండా లే ఆఫ్‌లు, రిట్రెంచ్‌మెంట్‌లు చేయొచ్చు. లేదా మూసివేయొచ్చు. ఇప్పుడది 300మంది కార్మికులుండే పరిశ్రమలకు వర్తింపజేస్తూ మార్చారు. అలాగే జాతీయ స్థాయి పారిశ్రామిక ద్విసభ్య ట్రిబ్యునళ్లలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితోపాటు కార్మిక సంబంధ అంశాల్లో పరిజ్ఞానం, అనుభవం వున్న ఒకరికి చోటు చోటు కల్పించాలని ముసాయిదాలో వుంటే ప్రస్తుత బిల్లులో దాన్ని ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదావున్న వ్యక్తికి కట్టబెట్టారు. గుర్తింపు కార్మిక సంఘాల విషయంలోనూ, సమ్మె నోటీసు విషయంలోనూ తాజా నిబంధనలు కఠినంగా వున్నాయి. మారిన ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు సంస్కరణలు తీసుకురావడం ఎంత అవసరమో, అవి మెజారిటీ ఆమోదం పొందేలా, ఏకాభి ప్రాయ సాధన దిశగా వుండటమూ అంతే అవసరం. అప్పుడే వాటి ఉద్దేశిత లక్ష్యాలు నెరవేరతాయి. అటు సాగు రంగ సంస్కరణల్లోనూ, ఇటు కార్మిక రంగ సంస్కరణల్లోనూ ఆ భావన లేకపోవడం విచారకరం.
Comments
Please login to add a commentAdd a comment