ఆమిర్‌ఖాన్ ‘త్రీ ఇడియట్స్’, ‘ఆల్ ఈజ్ వెల్’ అనే పాపులర్ పాట గుర్తుండే ఉంటుంది. ఆదివారం ఆరున్నర గంటల బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో పెద్దలు చెప్పిన మాటలు, చేసిన ప్రశంసలు, ఆమోదించిన రాజకీయ తీర్మానం చూస్తే – అచ్చంగా ఆ పాటే గుర్తొస్తుంది. అనేక సంక్షోభాలున్నా ఇటు దేశం, ఉపఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్నా అటు పార్టీ – రెండూ ‘అద్భుతంగా ఉన్నాయ’ని నమ్మాలనిపిస్తుంది. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనీ, కరోనాపై పోరులో వంద కోట్ల టీకా డోసులతో విజయం సాధించిందనీ, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిందనీ – ఇలా బీజేపీ రాజకీయ తీర్మానం నిండా ప్రభుత్వ ప్రశంసలే. అది చూస్తే సరిహద్దుల్లో కానీ, భారత గడ్డ మీద కానీ ఎలాంటి సమస్యలూ లేవనీ, నిరుద్యోగమనే మాటే లేదనీ, దేశానికి ఎలాంటి సవాళ్ళూ లేవనీ అనిపిస్తుంది.
సాధారణంగా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కష్టసుఖాలను కలబోసుకోవడానికే కార్యవర్గ భేటీ. కానీ, పాలన బాగుందనే భావన కలిగించడానికీ, ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేసుకోవడానికీ, పార్టీ రథసారథులెవరో పునరుద్ఘాటించడానికీ ఈ భేటీని వినియోగించారు. బీజేపీ సంస్థాగత రాజ్యాంగం ప్రకారం మూడు నెలలకోసారి కార్యవర్గ సమావేశం జరగాలి. ఈసారి మూడేళ్ళకు జరిగింది. అందులోనూ యూపీ, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌లలో వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఎన్నికలు. కరోనా రెండో వేవ్ తర్వాత తొలి భారీ ఎన్నికలు ఇవే. అందుకే, దిశానిర్దేశం చేసే ఈ పార్టీ చర్చావేదికకు అంత ప్రాధాన్యం. గ్లాస్గోలో జరుగుతున్న ‘కాప్–26’ పర్యావరణ సదస్సులో కీలక చర్చల్లో మునిగి ఉన్న కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఆ పర్యటనకు మధ్యలో విరామం ఇచ్చి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏకంగా 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఢిల్లీకి వచ్చి సమావేశంలో పాల్గొని, ఆయన మళ్ళీ గ్లాస్గోకు వెళ్ళారు. దాన్ని బట్టి, బీజేపీ నేతలు ఈ భేటీకి ఇచ్చిన ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు.
గెలుపే ధ్యేయంగా, డిసెంబర్ 25 కల్లా దేశంలోని 10.4 లక్షల పోలింగ్ కేంద్రాల్లో బూత్ కమిటీల ఏర్పాటును పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏప్రిల్ 6 కల్లా ఓటర్ల జాబితాలో పేజీకో వ్యక్తి బాధ్యుడిగా, గుజరాత్ ‘పన్నా (పేజీ)’ కమిటీ ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలనీ నిర్ణయించింది. వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి, వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుతో చరిత్ర సృష్టించాలంటే, యూపీ ఎన్నికల విజయం కీలక శుభారంభమని పెద్దలకు తెలుసు. అందుకే, యోగి ఆదిత్యనాథ్‌కు ఈ భేటీలో పెద్ద పీట వేశారు. పార్టీ విజన్‌గా కీలకమైన రాజకీయ తీర్మానాన్ని గడచిన 2017, 2018 కార్యవర్గ భేటీల్లో రాజ్‌నాథ్ సింగ్ లాంటి సీనియర్లు ప్రతిపాదిస్తే, ఈసారి ఆ పని యోగి చేతిలో పెట్టారు. అలా యోగి ప్రాధాన్యాన్ని చేతల్లో చూపారు.
346 మంది పార్టీ కార్యవర్గ సభ్యుల్లో 342 మంది ప్రత్యక్షంగానో, వర్చ్యువల్‌గానో హాజరైన ఈ వేదికపై అంతర్గత సమస్యలపై మనసు విప్పి మాట్లాడుకున్నది అరుదే! రానున్న రాష్ట్ర ఎన్నికలే ప్రధానంగా, జాతీయ అధ్యక్షుడు నడ్డా మొదలు అందరూ మోదీ ఎంతో చేశారంటూ, స్తోత్రపాఠాలపై దృష్టి పెట్టారు. మోదీ తన 50 నిమిషాల ప్రసంగంలో కుటుంబ పార్టీలంటూ ప్రతిపక్షాలను విమర్శిస్తూ, కార్యకర్తలు పార్టీకీ– ప్రజలకూ మధ్య విశ్వసనీయ వారధిగా మారాలని ఉపదేశించారు.
ఇటీవల పలువురు బీజేపీ నేతలు అనేక అంతర్గత సమస్యలను ఆంతరంగికంగా అంగీకరిస్తూ వచ్చారు. తీరా పార్టీ అత్యున్నత వేదికపైనేమో అంతా అద్భుతంగా ఉందన్న భావనే కలిగించారు. ఉప ఎన్నికలలో బీజేపీకి అనేక చోట్ల ఎదురుగాలి వీచి, మిశ్రమ ఫలితాలే వచ్చాయి. పార్టీ తీర్మానం మాత్రం విజయాలనే ప్రస్తావించడం విచిత్రం. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని గుర్తుచేసుకున్నారు కానీ, దేశ రాజధాని సరిహద్దుల్లో అనేక నెలలుగా సాగుతున్న రైతుల ఆందోళన ఊసే ఎత్తలేదు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో 3 నుంచి 77 స్థానాలకు ఎదిగిన బీజేపీ సంఖ్యాబలం కేవలం ఆరు నెలల్లో 70కి చేరిన పరిస్థితులనూ సమీక్షించుకోలేదు. ఇక, బీజేపీ నుంచే మేఘాలయ గవర్నరైన సత్యపాల్ మాలిక్ బాహాటంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కేంద్ర రైతు చట్టాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మోదీ సహా బీజేపీ సర్కారుపై విమర్శ బాణాలు విసురుతున్నారు. ఇలాంటివేవీ పార్టీ వేదికపై అంతర్గతంగానైనా చర్చకు వచ్చినట్టు లేవు.
బీజేపీ నేతల మాటలకూ, వారికి అంతరాత్మ లాంటి ఆరెస్సెస్ మాటలకూ కొన్నిసార్లు పొంతన కనపడట్లేదు. కరోనా లాక్డౌన్ కాలం విజయవంతమైందని నడ్డా అంటే, ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భాగవత్ లాక్డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆ మధ్యే చెప్పారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పార్టీ అంటే, అక్కడ ఉగ్రవాదుల మారణకాండను ఆరెస్సెస్ అధినేత ఎత్తిచూపారు. అందులో ఏది నిజమో బీజేపీకి తెలుసు. కానీ, వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి నిరాకరించినట్టు కనిపిస్తోంది. పరిస్థితి చూస్తే, మోదీ – అమిత్ షా సారథ్యంలోని బీజేపీ కొన్నిసార్లు సంఘ్ పరివార్‌లో మరింత స్వతంత్రంగా వ్యవహరిస్తోందా అనిపిస్తోంది. గెలుపు కోసం పార్టీ కన్నా పాపులరైన ప్రధాని మీదనే అతిగా ఆధారపడుతోందా అని అనుమానం వేస్తోంది. వ్యక్తిపూజ కన్నా సంస్థాగత శక్తే గొప్పదనీ, అది పాటించని అనేక పార్టీలకు ఇప్పుడు అవస్థలు తప్పట్లేదనీ బీజేపీకి బాగా తెలుసు. ప్రస్తుతానికి మాత్రం అధికారాన్ని విస్తరించుకోవడం మీదే ఆ పార్టీ దృష్టి. అది నెరవేరినంత కాలం అంతా బాగున్నట్టే! ఉన్నట్టుండి బొమ్మ తిరగబడితేనే కొత్త కథ మొదలు!!
నిజమా! అంతా బాగుందా?
Published Wed, Nov 10 2021 12:01 AM | Last Updated on Wed, Nov 10 2021 12:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment