పరిశోధన, ప్రజా విధానాలకు సూచన, సలహాల్లో యాభై ఏళ్ళుగా కృషి చేస్తూ, స్వర్ణోత్సవం జరుపుకోవడమనేది ఉత్సాహంగా ముందుకు అడుగేయాల్సిన సందర్భం. కానీ, అందుకు విరుద్ధంగా అడుగులు ముందుకు పడకుండా పాలకులే అడ్డం పడితే? పౌర విధానానికి సంబంధించి దేశంలోకెల్లా అత్యంత గౌరవనీయమైన ఢిల్లీకి చెందిన మేధావుల బృందమైన ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’ (సీపీఆర్) విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అలానే ఉంది.
ఆ సంస్థకు విదేశీ విరాళాలు, ఆర్థిక సహాయం అందే వీలు లేకుండా ‘విదేశీ సహాయ (నియంత్రణ) చట్టం’ (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద రిజిస్ట్రేషన్‌ను ఆరు నెలల పాటు కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 27న ఉత్తర్వులివ్వడం జాతీయ, అంతర్జాతీయ మేధావులను ఉలిక్కిపడేలా చేసింది.
విద్యావిషయిక కార్యక్రమాలకే లైసెన్స్ ఇచ్చామనీ, కానీ సీపీఆర్ మాత్రం విదేశీ విరాళాలను పుస్తక ప్రచురణ లాంటి వాటికీ వినియోగిస్తోందనీ ఆ ఉత్తర్వుల ఆరోపణ. అయిదు నెలల క్రితం గత సెప్టెంబర్‌లో ఢిల్లీలోని సీపీఆర్ కార్యాలయం, అలాగే ఆక్స్‌ఫామ్ ఇండియా, పలు డిజిటల్ మీడియా సంస్థలకు నిధులిచ్చే బెంగళూరుకు చెందిన ‘ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండే షన్’ (ఐపీఎస్‌ఎంఎఫ్)లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విరుచుకుపడింది. సర్వేలు నిర్వహించింది.
ఆ వెంటనే సిబ్బందికి సమన్లు వెళ్ళాయి. దానికి కొనసాగింపుగా పన్ను మినహాయింపును రద్దు చేస్తామని హెచ్చరిస్తూ, షోకాజ్ నోటీసు వెళ్ళాయి. ఒక రకంగా దాని కొనసాగింపే – ఇప్పుడీ లైసెన్స్ రద్దు. నిజానికి, లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థగా 1976 నుంచి సీపీఆర్‌కు పన్ను మినహాయింపు లభిస్తోంది. వచ్చే 2027 దాకా మినహాయింపు ఉన్నా, ఇప్పుడీ బెదిరింపులు గమనార్హం.
ఆదాయపు పన్ను లెక్కల్లో తేడాలుంటే విచారించడం తప్పు కాదు. చట్టం ముందు అందరూ సమానులే గనక ఏమన్నా తప్పు చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకోవడమూ తప్పనిసరే. కానీ, మనసులో ఏదో పెట్టుకొని, ఏ చిన్న లోపం కనిపించినా, వెంటాడి వేధించాలని అనుకుంటేనే అది హర్షించలేని విషయం.
ఆ సంస్థ బాధ్యుల్లోని పరిశోధకులు కొందరు ప్రభుత్వ విధానాల్ని తప్పుబడుతూ ఇటీవల రాసిన వ్యాసాలే దీనికి హేతువని ఓ బలమైన విమర్శ. ఎక్కడా, ఏ తప్పూ చేయలేదని తేలినప్పటికీ, సాంకేతిక కారణాలే సాకుగా సీపీఆర్ లాంటి స్వతంత్ర మేధాసంస్థను వేధిస్తున్నారన్నది స్పష్టం. కొండను తవ్వి ఎలుకను పట్టే ఈ దీర్ఘకాల ప్రక్రియతో మానసికంగా వేధించడమే పాలక వర్గాల పరమార్థంగా కనిపిస్తోంది.
నిజానికి, సీపీఆర్ అనేది దేశంలోని అగ్రేసర స్వతంత్ర పరిశోధనా సంస్థల్లో ఒకటి. విభిన్నరంగాలకు చెందిన పరిశోధకులు, వృత్తినిపుణులు, విధాన నిర్ణేతలతో కూడిన మేధావుల బృందం ఇది. ఈ లాభాపేక్ష రహిత సంస్థ 50 ఏళ్ళ క్రితం 1973లో ఏర్పాటైంది. ప్రభుత్వ విధానాల్లోని వివిధ అంశాలపై ఈ సంస్థలోని బుద్ధిజీవులు దృష్టి సారిస్తుంటారు.
ఆర్థికవేత్త – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్ సహా పలువురు మేధావులు ఈ సంస్థ కార్యవర్గంలో మాజీ సభ్యులు. అనేక కేంద్ర శాఖలతో, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలతోనూ కలసి పనిచేసిన ఈ సంస్థను భారత ప్రభుత్వం గుర్తించింది. దశాబ్దాలుగా పన్ను మినహాయింపూ ఇస్తోంది. గత ఏడాదీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖల నుంచి సీపీఆర్‌కు నిధులు వచ్చాయి.
మరి, ఉన్నట్టుండి సీపీఆర్ జీవితం మీద పాలకులకు ఎందుకు విరక్తి కలిగినట్టు? దీనికి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న ‘జన అభివ్యక్తి సామాజిక్ వికాస్ సంస్థ’ (జస్వాస్) సహా దాదాపు 30 సంస్థలకు డేటా సేకరణ, పర్యావరణ చట్టం సహా పలు అంశాల్లో పరిశోధనకు సీపీఆర్ నిధులిచ్చింది.
ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగులు తిరిగే జీవవైవిధ్య ప్రాంతం హస్‌దేవ్‌లో బొగ్గు గనుల అక్రమ తవ్వకంపై ఆదివాసీ ఉద్యమంలో జస్వాస్ ట్రస్టీ అయిన ఒక పరిశోధకుడి భాగం కూడా ఉంది. ఆ గనులు పాలకుల ఆశీస్సులున్న వ్యాపార సంస్థవనీ, ఆ ఉద్యమానికీ – సీపీఆర్‌తో జస్వాస్ భాగస్వామ్యానికీ సంబంధం లేకున్నా పాలకులకు అది కోప కారణమైందనీ విశ్లేషకుల మాట. కారణాలు ఏమైనా, ఏలినవారికి కోపమొస్తే బండి నడవడం కష్టమనే విషయం తాజా సీపీఆర్ లైసెన్స్ రద్దుతో మరోసారి రుజువు చేస్తోంది.
గమనిస్తే – ఐటీ విభాగం తన నోటీసుల్లో పేర్కొన్న పరిశీలనలు, చేసిన ఆరోపణలు దాని పరిధిని దాటి ఉన్నాయి. ఇది పాలకులపై అనుమానాలకు ఊతమిస్తోంది. సీపీఆర్ మాత్రం తమ కార్యకలాపాలన్నీ చట్టబద్ధమైనవేననీ, ప్రభుత్వ సంస్థలు తమ ఆదాయ వ్యవహారాలను ఎప్పటి కప్పుడు ఆడిట్ చేస్తూనే ఉన్నాయనీ స్పందించింది. రాజ్యాంగ విలువల స్ఫూర్తితో ఈ వివాదం వీలైనంత త్వరలో సమసిపోతుందని అభిలషించింది.
ఆ అభిలాష వాస్తవరూపం ధరిస్తే సంతో షమే. అయితే, పాలకులు తమ చేతుల్లోని దర్యాప్తు సంస్థలనూ, విభాగాలనూ దుర్వినియోగం చేయ డానికి ఏ మాత్రం వెనుకాడని గతం, వర్తమానమే భయపెడుతున్నాయి. నిబంధనల్లోని సాంకేతిక అంశాలను ఆయుధంగా చేసుకొని, భావప్రకటన స్వేచ్ఛకున్న అవకాశాల్ని అడ్డుకోవాలని పాలకులు చూడడం ఆందోళన రేపుతోంది.
ఐటీనైనా, విదేశీ స్వార్థ ప్రయోజనాలు మన దేశ రాజకీయాలను ప్రభావితం చేయరాదని పెట్టుకున్న ఎఫ్‌సీఆర్‌ఎ లాంటి నియంత్రణ వ్యవస్థనైనా ప్రభుత్వేతర సంస్థల పీక నులమడానికి వాడితే అది అప్రజాస్వామికమే కాదు... అచ్చమైన ప్రతీకారమే!
వెంటాడు... వేటాడు...
Published Tue, Mar 7 2023 12:35 AM | Last Updated on Tue, Mar 7 2023 12:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment